ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో కోట్లల్లో షేర్లను అమ్మేసిన ఎల్ఐసీ.. వేల కోట్లు వచ్చాయ్!

Wait 5 sec.

LIC Sells SBI Shares: లైఫ్ ఇన్సూరె్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC).. భారతదేశంలోనే ప్రభుత్వ రంగ అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ప్రజలకు ఆర్థిక రక్షణ, పొదుపు, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందించే పాలసీల్ని ఆఫర్ చేస్తుంది. ఈ పాలసీ ప్రీమియంల ద్వారా సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతుంది. ఇక ఈ మొత్తాన్ని ఎల్ఐసీ పెట్టుబడుల రూపంలో పెడుతుందన్న సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్, ప్రభుత్వ బాండ్లు సహా రియల్ ఎస్టేట్ వంటి లాభదాయక రంగాల్లో పెడుతుంది. వీటి ద్వారా వడ్డీ, డివిడెండ్ల ఆదాయం కూడా వస్తుంది. ఇక దేశంలోనే అతిపెద్ద సంస్థాగత మదుపరుల్లో (DII) ఎల్ఐసీ ముందు వరుసలో ఉంటుంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఇక ప్రతి త్రైమాసికంలోనూ ఎప్పటికప్పుడు తమ ఫండ్ పోర్ట్‌ఫోలియోను సమీక్షిస్తుంటుంది. అంటే షేర్లను అమ్మడం, కొనడం వంటివి చేస్తుంటుంది. ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ ఎల్ఐసీ తన పోర్ట్‌ఫోలియోలో కీలక మార్పులు చేసింది. ఇందులో దిగ్గజ కంపెనీల షేర్లను విక్రయించడం విశేషం. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐలో అంతకుముందు డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి 84.51 కోట్ల షేర్లు ఉండగా.. ఇక్కడ 4 కోట్లకుపైగా షేర్లను విక్రయించి మార్చి త్రైమాసికం నాటికి 80.29 కోట్ల షేర్లకు తగ్గించుకుంది. దీని ద్వారా ఎల్ఐసీకి రూ. 4,626 కోట్ల రాబడి వచ్చింది. >> ఐసీఐసీఐ బ్యాంకులో చూస్తే 34.43 కోట్ల షేర్ల నుంచి 31.86 కోట్ల షేర్లకు వాటా తగ్గించుకుంది. ఇక్కడ షేర్లను విక్రయించడం ద్వారా రూ. 3,449 కోట్లు పొందింది. కోల్ ఇండియాలో 71.34 కోట్ల షేర్ల నుంచి 68.07 కోట్లకు చేరాయి. ఇక్కడ రూ. 1431 కోట్ల రాబడి వచ్చింది. పిరమల్ ఫైనాన్స్ కంపెనీలో ఎల్ఐసీ షేర్ల సంఖ్య 1.01 కోట్ల నుంచి భారీగా తగ్గించుకుంది. గ్రేసిమ్ ఇండస్ట్రీస్‌లో షేర్ల సంఖ్య 4.98 కోట్ల నుంచి 4.51 కోట్లకు చేరుకుంది. మరోవైపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో చూస్తే షేర్ల సంఖ్య 63.57 కోట్ల నుంచి 62.24 కోట్లకు తగ్గింది. ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ రూ. 1145 కోట్లుగా ఉంది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో 1.25 కోట్ల నుంచి 1.07 కోట్లకు షేర్లను తగ్గించుకుంది. లార్సెన్ అండు టుబ్రోలో చూస్తే 17.27 కోట్ల నుంచి 17.03 కోట్లకు షేర్లను తగ్గించుకుంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 37.93 కోట్ల షేర్ల నుంచి 32.41 కోట్లకు షేర్ల సంఖ్య తగ్గింది. టాటా స్టీల్ కంపెనీలోనూ భారీగా షేర్ల సంఖ్య తగ్గించుకోవడం గమనార్హం. ఇక్కడ ఎల్ఐసీ షేర్ల సంఖ్య 90 కోట్ల నుంచి 86.43 కోట్లకు చేరుకుంది.