ఆర్సీబీ వివాదంపై తొలిసారి నోరువిప్పిన యశ్ దయాల్.. ఐపీఎల్ 2026కు దూరంపై కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ ఐపీఎల్ 2026కు దూరమైన విషయం తెలిసిందే. అయితే, ఈ సీజన్‌కు దూరమవ్వడంపై దయాల్ తొలిసారి స్పందించాడు. ఈ సీజన్‌లో ఆడకపోవడం తన నిర్ణయం కాదంటూ.. గతంలో ఆర్సీబీ యాజమాన్యం చెప్పిన కారణాలను విభేదిస్తూ సంచనల వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో యశ్ దయాల్ పాత్ర చాలా కీలకం. సీఎస్కేతో మ్యాచ్‌ మొదలు.. ఫైనల్‌లో శ్రేయాస్ అయ్యర్‌ను అవుట్ చేయడం వరకూ యశ్ కీ రోల్ పోషించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండటంపై గతంతో ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబట్ మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతోనే యశ్ దయాల్ ఆడటం లేదని చెప్పాడు. తాజాగా, యశ్ దయాల్ ఆ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించాడు. టాక్ విత్ మన్వేంద్ర పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన యశ్ దయాల్.. ఐపీఎల్ 2026 నుంచి తప్పుకోవడం తన వ్యక్తిగత నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. "ఇంట్లో కూర్చుని టీవీలో జట్టును చూస్తుంటే కొన్నిసార్లు బాధేస్తుంది. కానీ అదీ నా జట్టే, వాళ్లు నన్ను వదిలేయలేదు. నన్ను రిటైన్ చేశారు. నా స్థానంలో మరో ఆటగాడిని కూడా తీసుకోలేదు. బహుశా నేను జట్టుకు ముఖ్యమైన ఆటగాడినని వారు భావిస్తున్నారేమో. అలాగే నేను ఈ సీజన్ నుంచి తప్పుకోవడం నా వ్యక్తిగత నిర్ణయం కాదు. అది వివాదాస్పదం కావచ్చు. ఆర్సీబీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో నాకు తెలియదు. జట్టును చాలా మిస్ అవుతన్నా" అని చెప్పాడు. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు మో బోబట్ మాట్లాడుతూ .. యశ్ దయాల్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు దూరమవుతున్నాడని తెలిపాడు. అయితే అతడికి ఫ్రాంఛైజీ పూర్తిగా మద్దతు ఇస్తోందని, కాంట్రాక్ట్‌లో కొనసాగిస్తున్నామని స్పష్టం చేశాడు. అందుకే ఈ సీజన్ కోసం రిటైన్ చేసినట్టు క్లారిటీ ఇచ్చాడు. ఆర్సీబీ యాజమాన్యంతో మంచి సంబంధాలు ఉన్నాయని యశ్ దయాల్ స్పష్టం చేశాడు. తరచూ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతున్నానని తెలిపాడు. డైరెక్టర్, కోచ్, దినేశ్ కార్తీక్‌తో కూడా టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. తమ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదని, అంతా క్లియర్‌గానే ఉందంటూ స్పష్టం చేశాడు.