భారత్‌లో టాక్సిక్ కల్చర్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఒక జట్టు ఫ్యాన్స్.. మరొకరిపై విమర్శలు చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు ప్రముఖ ఆటగాళ్ల కుటుంబ సభ్యులను టార్గెట్ చేసే వరకూ వచ్చింది. మొన్నటికి మొన్న ట్రావిస్ హెడ్ భార్య ఆస్ట్రేలియా మీడియాలో భారత అభిమానుల వేధింపులపై భావోద్వేగానికి గురవ్వగా.. తాజాగా కూడా సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్, వేధింపులను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సోదరి శ్రేష్టా అయ్యర్‌ని నెటిజన్లు టార్గెట్ చేశారు. మే 24న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడంతో.. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ మ్యాచ్ తర్వాత గతంలో చేసిన ఓ బాంటర్ రీల్ వైరల్ అయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ - పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అప్పట్లో పంజాబ్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. దాంతో తాము కేకేఆర్‌కి ఒక పాయింట్ ఫ్రీగా ఇచ్చామంటూ ఫ్రెండ్స్‌తో కలిసి శ్రేష్టా అయ్యర్ రీల్ చేసింది. ఇప్పుడు అదే ఒక్క పాయింట్ తేడాతో పంజాబ్ ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేక ఎలిమినేట్ అయింది. ఆ రీల్‌ను ఇప్పుడు కొందరు రీ అప్‌లోడ్ చేసి శ్రేష్టా అయ్యర్ ట్రోల్ చేశారు. అయితే ఆ ట్రోల్స్ శృతిమించి పర్సనల్ నుంచి ఫ్యామిలీ అటాక్ వరకూ వెళ్లాయంటూ శ్రేష్టా అయ్యర్ ఎమోషనల్ అయింది. కేకేఆర్‌పై గతంలో చేసిన వీడియో కూడా ఒక సరదా బాంటర్ అని, కానీ తప్పుగా అర్థం చేసుకున్నారంటూ శ్రేష్టా చెప్పుకొచ్చింది. ఆఫీస్‌కు ఫోన్ చేసి టీమ్‌తో పాటు కుటుంబ సభ్యులను కూడా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది"కేకేఆర్‌పై చేసిన వీడియోను చాలా దూరం ఆలోచించారు. ఆ రీల్ ఉద్దేశం కేవలం సరదాగా బాంటర్ చేయడమే. నేను ఎవర్నీ ట్రోల్ చేయలేదు. ఎవరి మీదా ద్వేషం చూపించాలనే ఉద్దేశం లేదు. నా బ్రదర్ క్రికెటర్ కావడంతో ప్రతి క్రికెటర్‌ను నేను గౌరవిస్తాను. చాలా మంది నా ఆఫీస్‌కు ఫోన్లు చేస్తున్నారు. నన్ను, నా టీమ్ మేట్స్‌ని, స్టూడెంట్స్‌ను, నా కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా బాధాకరం. నాపై విమర్శలు చేయాలనుకుంటే చేయండి. కానీ నాతో సంబంధం ఉన్న వారిని ఇబ్బంది పెట్టడం ఆపండి. నా బ్రదర్ గెలిచినా, ఓడినా నేనెప్పుడూ అతన్నే ప్రోత్సహిస్తూ ఉంటాను" అని చెప్పింది.