తెలంగాణలోని ప్రతీ గ్రామంలోని ప్రతీ ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రాం కింద.. తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టును అమలు చేయడంపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా చర్చించారు. తొలిదశలో తెలంగాణలోని పలు జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పలు కీలక అంశాలను కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటికి బలమైన హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. అదే సమయంలో అమెండెడ్‌ భారత్‌నెట్‌ ప్రోగ్రాం అమలుకు సంబంధిత ఒప్పందాన్ని వెంటనే కుదుర్చుకోవడం.. పెండింగ్‌లో ఉన్న నిధులను వేగంగా విడుదల చేయడం వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు. ప్రతీ మండలం నుంచి ప్రతీ గ్రామ పంచాయతీ రింగ్‌ నెట్‌వర్క్‌ ఆస్తులను డిజిటల్‌ భారత్‌ నిధికి బదిలీ చేసేందుకు స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడంపై జ్యోతిరాధిత్య సింధియాతో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణకు కేంద్రం అన్నివిధాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంగా అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ సజావుగా అమలు చేయడంపై కేంద్రమంత్రి దృష్టికి కొన్ని కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ప్రోగ్రామ్ కింద తెలంగాణలో టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుపై ముఖ్యమంత్రి కేంద్రమంత్రితో చర్చించారు. తెలంగాణ ఆశిస్తున్న లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణ ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం.. తద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా విస్తృతమైన హై స్పీడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి పరుచుకోవడానికి వీలుంటుందని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఏకీకృత డిజిటల్ విధానం వల్ల టీ ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానిస్తూ రింగ్ ఆర్కిటెక్చర్‌గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా ఒక మార్గంలో నెట్‌వర్క్‌ అంతరాయం ఏర్పడినా.. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నిరంతరం సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోనున్నారు. దీనివల్ల గ్రామీణ తెలంగాణకు అంతరాయం లేకుండా హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో.. నెట్‌వర్క్ దెబ్బతిన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీని పునరుద్ధరించనున్నారు. అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద గ్రామాలను అనుసంధానిస్తూనే.. భవిష్యత్తు అవసరాలకు సరిపడే ఫైబర్ నెట్ వర్క్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రంలోని హై స్పీడ్ నెట్‌వర్క్ అందుతున్న ఇతర ప్రాంతాలకు సమంగా సేవలు అందించవచ్చని పేర్కొన్నారు.