తిరుమల శ్రీవారిని ప్రతిరోజూ దర్శించుకునే భక్తులు కానుకలు, విరాళాలు అందజేస్తుంటారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలు ఇస్తారు.. బంగారం, వెండి, వాహనాలు, విలువైన వస్తువుల్ని స్వామివారి పేరుతో అందిస్తుంటారు. ఇటీవలి కాలంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ట్రస్ట్‌లకు భక్తుల భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు. అలాగే కొందరు భక్తులు స్వామివారికి భారీగా బంగారాన్ని, వెండిని అందజేస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారికి భారీగా బంగారం, వెండి కానుకలుగా అందాయి.కర్ణాటకలోని మైసూరుకు చెందిన‌ ఓ అజ్ఞాత‌ భ‌క్తుడు రూ.1.10కోట్లు విలువైన ఐదు బంగారు ప‌త‌కాల‌ను విరాళంగా అందించారు.. ఆయన తన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. తమిళనాడు రాజధాని చెన్నైకు చెందిన గోపాల కృష్ణ, పురుషోత్తం అనే భ‌క్తులు శ్రీ‌వేంక‌టేశ్వర స్వామి వారికి సుమారు నాలుగున్నర కేజీల బ‌రువు గ‌ల‌ వెండి న‌క్షత్ర హార‌తులను విరాళంగా అందించారు. ఈ మేర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ నాయ‌కుల మండ‌పంలో డిప్యూటీ ఈవో లోక‌నాథంకు న‌క్షత్ర హార‌తుల‌ను అంద‌జేశారు. ఈ సందర్భంగా దాతల్ని టీటీడీ అభినందించింది.తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గరుడసేవ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి తరఫున తన అన్నగారైన శ్రీ గోవిందరాజస్వామివారికి సుమారు రూ.71 లక్షల విలువైన నాలుగు దివ్య ఆభరణాలను టిటిడి భక్తి పూర్వకంగా సమర్పించింది. ఈ దివ్య కానుకల్లో సాధారణ రాళ్లు కలిగిన బంగారు గుండు పతకం, ఒక జత సాధారణ రాళ్లు గల బంగారు పతకాలు, బంగారు కాసుల మాల ఉన్నాయి. ఈ అమూల్య ఆభరణాలతో అలంకరింపబడిన శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.స్థానిక శ్రీ ఎదురు ఆంజనేయస్వామి ఆలయం నుండి శ్రీవారి ఆభరణాలను తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో ఎం.లోకనాథం ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలు, వేదఘోషలు, గోవింద నామస్మరణల మధ్య ఘనంగా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అంతకుముందు తిరుమల నుంచి అలిపిరి, కోమలమ్మ సత్రం మీదుగా బంగారు నగలు ఊరేగింపుగా శ్రీ ఎదురు ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకువచ్చి ఆలయ అధికారులకు అప్పగించారు. ఇదే సందర్భంగా స్వామివారికి నూతన వస్త్రాలు, తిరువడిని కూడా శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చారు. ఏనుగులు, గుర్రాలు, రంగురంగుల నృత్య బృందాలు, కోలాట కళాకారుల ప్రదర్శనలు గరుడసేవ వైభవాన్ని మరింత ఇనుమడింపజేశాయి. తమిళనాడు రాష్ట్రం తిరువండ్రవూరుకు చెందిన శ్రీ భాష్య కార్ల కైంకర్య ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ దినేష్ కుమార్ 8 గొడుగులను టిటిడి ఏఈవో ఏబీ నారాయణ చౌదరికి అందించారు.