ఈ పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. డీఆర్ పెంపు.. కొత్త రేట్లు ఇవే, ఎవరు అర్హులంటే?

Wait 5 sec.

: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం నుంచి మరోసారి తీపి కబురు అందింది. అయితే ఈసారి అందరికీ కాకుండా పాత పెన్షన్ విధానంలో కొనసాగుతున్న నిర్దేశిత కేటగిరీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు డియర్నెస్ రిలీఫ్ (DR)ను భారీగా పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5వ సెంట్రల్ పే కమిషన్ (5th CPC) పరిధిలోకి వచ్చే సీపీఎఫ్ (CPF) ఉద్యోగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అధికారిక మెమోరాండం జారీ చేసింది. ఇందులో మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం ఆమోదంతో పెన్షన్ల శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. సవరించిన ఈ కొత్త డియర్నెస్ రిలీఫ్ రేట్లు జులై 1, 2025, జనవరి 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ పెరిగిన డీఆర్ ప్రయోజనం కేవలం పరిమిత కేటగిరీకి చెందిన పాత సీపీఎఫ్ (Contributory Provident Fund) లబ్ధిదారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. నవంబర్ 18, 1960 నుంచి డిసెంబర్ 31, 1985 మధ్య కాలంలో రిటైర్ అయి, బేసిక్ ఎక్స్ గ్రేషియా చెల్లింపులు అందుకుంటున్న సీపీఎఫ్ లబ్ధిదారులు దీనికి అర్హులు. గ్రూప్-A, B, C, D ఉద్యోగులుగా ఉండి ప్రస్తుతం రూ.3000, రూ.1000, రూ.750, రూ.650 ఎక్స్ గ్రేషియా పొందుతున్న వారికి డీఆర్ రేట్లను సవరించారు. జూలై 1, 2025 నుంచి 474 శాతం డీఆర్, జనవరి 1, 2026 నుంచి 483 శాతం డీఆర్ అందించనున్నారు. ఉద్యోగుల జీవిత భాగస్వాములు, అర్హులైన పిల్లలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. నెలకు రూ.645 ఎక్స్ గ్రేషియా పొందుతున్న ఈ ఫ్యామిలీ పెన్షనర్లకు డీఆర్ పెరగనుంది. జూలై 1, 2025 నుంచి 466 శాతం, జనవరి 1, 2026 నుంచి 475 శాతం మేర డీఆర్ అందించనున్నారు. ఇవే కాకుండా నవంబర్ 18, 1960 కంటే ముందు రిటైర్ అయి రూ.654, రూ.659, రూ.703, రూ.965 ఎక్స్ గ్రేషియా పొందుతున్న నిర్దిష్ట కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులకు సైతం ఈ సవరించిన రేట్లు వర్తిస్తాయి.కొత్త రేట్ల ప్రకారం డీఆర్ మొత్తాన్ని లెక్కించేటప్పుడు పైసల్లో తేడాలు వస్తే వాటిని తదుపరి రూపాయికి సవరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని కచ్చితంగా లెక్కించి లబ్ధిదారులకు అందించే బాధ్యతను జాతీయ బ్యాంకులు, పెన్షన్ పంపిణీ చేసే ఇతర అధికారులకు అప్పగించారు. భారతీయ ఆడిట్ అండ్ అకౌంట్స్ శాఖలో పని చేసి రిటైర్ అయి ఉద్యోగుల విషయంలో భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంప్రదింపులతో ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.