'విధిలేని పరిస్థితుల్లోనే వైఎస్ రాజారెడ్డి హత్య'.. 1962లోనే రౌడీ షీట్.. బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనలంగా మారాయి. విధిలేని పరిస్థితుల్లోనే వైఎస్ రాజారెడ్డి హత్య జరిగిందని వెల్లడించారు. ఇక వైఎస్ రాజారెడ్డిపై.. 1962లోనే రౌడీషీట్ నమోదు చేసినట్లు గుర్తు చేశారు. వైఎస్‌ రాజారెడ్డి భార్య జయమ్మ 1968లో పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా పోటీ చేసి కృష్ణమూర్తి చేతిలో ఓటమి పాలయ్యారని తెలిపారు. వైఎస్‌ కుటుంబంలో ఓటమి చరిత్ర అప్పుడే మొదలైందని బీటెక్‌ రవి తేల్చి చెప్పారు. తాజాగా మంగళగిరిలోని ఏర్పాటు చేసిన టీడీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు.1962లోనే పులివెందుల పోలీస్ స్టేషన్‌లో వైఎస్ రాజారెడ్డి పేరుతో రౌడీ షీట్‌ ఉందని బీటెక్ రవి తెలిపారు. వైఎస్ రాజారెడ్డిని నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టిన వెంకటనరసయ్యను అతి కిరాతకంగా హత్య చేశారని పేర్కొన్నారు. పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసేందుకు సహకరించిన వ్యక్తిని చంపేస్తారా అని ప్రశ్నించారు. మంగంపేట బైరైటీస్‌ వశం చేసుకుని.. దాని నుంచి వచ్చిన సంపాదనతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారని తెలిపారు. త్రివేణి స్టీల్స్‌ పెట్టి డెవలప్ అవుతున్న వ్యక్తిని కూడా దారుణంగా చంపిన చరిత్ర వాళ్లది అని పేర్కొన్నారు. లింగాల మండలంలో వైఎస్ రాజారెడ్డి కుటుంబం భయానక వాతావరణం సృష్టించిందని బీటెక్ రవి తేల్చి చెప్పారు. సింగిల్‌ విండో ప్రెసిడెంట్‌ రఘురామిరెడ్డిని హత్య చేశారని.. వాళ్లు చెప్పినట్టు వినకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేశారని ఆయనను చంపేశారని గుర్తు చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే రాజారెడ్డి హత్య జరిగిందని.. వైఎస్ కుటుంబం జోలికి ఎవరైనా వెళ్తే వాళ్లు ఎవరైనా దారుణంగా చంపేస్తారని వెల్లడించారు. మద్దెలచెరువు సూరితో వైఎస్ కుటుంబానికి స్నేహ సంబంధాలు లేవా అని ప్రశ్నించారు. జైలులో ఉండి ప్లాన్‌ చేసి పరిటాల రవిని హత్య చేయిస్తారా అంటూ మండిపడ్డారు.మొదట బళ్లారిలో ఆర్కేని చంపేశారని.. పరిటాల రవి అనుచరుడు అనంతపురంలో తగరకుంట ప్రభాకర్‌రెడ్డిని కూడా హత్య చేశారని బీటెక్ రవి వెల్లడించారు. ఆర్కే, ప్రభాకర్‌రెడ్డిని చంపిన తర్వాత పరిటాల రవిని హతమార్చారని చెప్పారు. టీడీపీని విడిచిపెట్టి రాలేదని పరిటాల రవిని చంపేశారని పేర్కొన్నారు. పులివెందులలో రిపోర్టర్ నారాయణను దారుణంగా హత్య చేశారని తెలిపారు. ప్రజల్లో ఆదరణ కలిగిన నేతలను బతకనిచ్చేవారు కాదని బీటెక్ రవి మండిపడ్డారు. అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయాలో వారికే తెలుసని పేర్కొన్నారు. ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్టు చంపేసిన పరిస్థితులు వైఎస్ కుటుంబానినిది అని ఆరోపించారు. ఇవాళ నీతులు చెబుతుంటే నవ్వొస్తోందని.. వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. తమకు తెలిసిన జగన్‌ వేరు.. ప్రజలకు తెలిసిన జగన్‌ వేరు అని బీటెక్‌ రవి తెలిపారు.