ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. ఓఆర్ఆర్ చుట్టూ 10 ఫార్మా విలేజ్‌లు

Wait 5 sec.

భారతదేశ ఫార్మా, బయోటెక్నాలజీ రాజధానిగా వెలుగొందుతున్న తెలంగాణ.. అంతర్జాతీయ స్థాయిలో మరో భారీ మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది. 2030 నాటికి ప్రపంచంలోని అత్యుత్తమ ఐదు లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా రాష్ట్రానికి స్థానం కల్పించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను ఆవిష్కరించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ నెక్ట్స్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీకి అధికారికంగా ఆమోదముద్ర వేసింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ రంగం ద్వారా రాష్ట్రంలో అదనంగా 5 లక్షల నూతన ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే ఈ విధానం యొక్క ప్రధాన సంకల్పం. కేవలం ఐదేళ్లలోనే దాదాపు 25 బిలియన్ అమెరికా డాలర్ల విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ఈ పాలసీని అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు.ఈ నూతన విధానం ప్రకారం.. రాష్ట్రంలో వికేంద్రీకృత, సమతుల్య, పర్యావరణహిత పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 1000 నుంచి 3 వేల ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో కూడిన పది ఫార్మా విలేజ్‌లను ప్రభుత్వం త్వరలోనే నిర్మించనుంది. ఈ విలేజ్‌లలో క్లినికల్ పరిశోధనలు, డయాగ్నస్టిక్స్, అత్యాధునిక వైద్య చికిత్సలకు అవసరమైన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. అలాగే ఇప్పటికే ప్రపంచ గుర్తింపు పొందిన జీనోమ్ వ్యాలీని మరో 300 ఎకరాల విస్తీర్ణానికి పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ.. వ్యర్థాలను బయటకు వదలకుండా జీరో లిక్విడ్ డిశ్ఛార్జి, నెట్ జీరో పద్ధతులతో గ్రీన్ ఫార్మాసిటీలను, కేంద్రీకృత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను అభివృద్ధి చేయనున్నారు.ఈ విధానంలో సరికొత్త ఆవిష్కరణలను, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్ల ప్రారంభ నిధితో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్‌ను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఏర్పాటు చేస్తోంది. భవిష్యత్తులో ఈ నిధిని రూ. 1000 కోట్లకు పెంచనున్నారు. ఇప్పటివరకు కేవలం తయారీ యూనిట్లకే పరిమితమైన ఆర్థిక ప్రోత్సాహకాలను, ఇకపై రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్లకు కూడా వర్తింపజేయడం ఈ పాలసీలోని ఒక విప్లవాత్మక మార్పు. తదుపరి తరం సాంకేతికతలైన సెల్ అండ్ జీన్ థెరపీ, CRISPR టెక్నాలజీ, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ వంటి అత్యాధునిక వైద్య ఆవిష్కరణలకు తెలంగాణను ప్రపంచ కేంద్రంగా మార్చడమే దీని అంతిమ లక్ష్యం.పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులను అందించేందుకు పాఠశాల ద్వారా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కేంద్రాలలో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా అభ్యర్థులను తీర్చిదిద్దుతారు. వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు, సింగిల్ విండో అనుమతుల వ్యవస్థ అయిన టీజీ ఐపాస్ ద్వారా నిర్ణీత కాలపరిమితిలోనే అన్ని రకాల అనుమతులు, డీమ్డ్ ఆమోదాలు లభించేలా చట్టాన్ని బలోపేతం చేశారు. అంతేకాకుండా, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే అర్హత గల సంస్థలకు స్టాంపు డ్యూటీ మినహాయింపు, విద్యుత్ సబ్సిడీలు, మూలధన పెట్టుబడి రాయితీలు, ఎస్జీఎస్టీ రీఇంబర్స్‌మెంట్‌ వంటివి ఈ నూతన పాలసీ ద్వారా తెలంగాణ సర్కార్ ప్రకటించింది.