ఆ పోస్టులు పెట్టారో క్రిమినల్ కేసులు పెడతారు.. పరువు నష్టం నోటీసులు.. సీరియస్ వార్నింగ్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది నిర్వహించిన మెగా డీఎస్సీపై సమాజంలో గందరగోళం సృష్టిస్తూ దుష్ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిరాధార ఆరోపణలు చేసినవారికి పరువు నష్టం నోటీసులు జారీ చేస్తామన్నారు. ఈ మేరకు తప్పుడు ప్రచారం చేసిన మీడియా, సోషల్ మీడియా, పలువురు వ్యక్తులు వెంటనే విద్యాశాఖకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని.. తప్పుడు ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మొద్దని సూచించారు. కొందరు ఆధారాలు కూడా లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'రాష్ట్రంలో గతేడాది నిర్వహించిన వందశాతం పారదర్శకంగా జరిగింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, నోటిఫై చేసిన నియామక నిబంధనలతోపాటు రిజర్వేషన్ విధానాలకు అనుగుణంగానే ఈ నియామక ప్రక్రియ అంతా జరిగింది. ప్రతి దశలోనూ పారదర్శకత, డిజిటల్ భద్రతా, ఫిర్యాదుల పరిష్కార విధానాలు, జిల్లా స్థాయిలో ధృవీకరణ వంటి వ్యవస్థలను పటిష్టంగా అమలు చేశారు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కొన్ని న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా వేదికతో పాటుగా కొందరు వ్యక్తులు కావాలనే మెగా డీఎస్సీ-2025పై నిరాధారమైన ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ నోటిఫైడ్ రిజర్వేషన్ విధానాలు.. ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలు తీరును కనీసం అర్థం చేసుకోలేదు. ప్రశ్నాపత్రాలు లీక్, మెరిట్ జాబితాలు ప్రచురించ లేదని, అక్రమ ఎంపికలు జరిగాయని.. ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారు' అని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 'మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి మెరిట్, ఎంపిక జాబితాలతోపాటు ఇతర అన్ని వివరాలు నోటిఫై చేసిన విధానం ప్రకారమే పారదర్శకంగా ప్రచురించాము. ఎంపిక ప్రక్రియ అంతా కేవలం మెరిట్, రిజర్వేషన్ రోస్టర్, ధృవీకరణ వ్యవస్థల ఆధారంగా, అత్యంత సురక్షితమైన డిజిటల్ విధానంలోనే నిర్వహించాము. ఈ అబద్ధపు ప్రచారాలు అభ్యర్థుల్లో అనవసర ఆందోళనలు రేకెత్తించడమే కాకుండా, విద్యాశాఖ ప్రతిష్టతోపాటు నియామక ప్రక్రియ విశ్వసనీయతకు భంగం కలిగిస్తున్నాయి. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాము. ప్రభుత్వం చేపట్టే అన్ని నియామక ప్రక్రియల్లో పారదర్శకత, నిష్పక్షపాతం, ప్రతిభ ఆధారంగా ఎంపికతోపాటు బాధ్యతాయుతమైన పరిపాలనకు పాఠశాల విద్యాశాఖ నిత్యం కట్టుబడి ఉంటుంది. . ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దు' అని సూచించారు.