తెలంగాణలో భగ్గమంటున్న భానుడు... వడదెబ్బతో 45 మంది మృతి, ఈ జిల్లాల్లో మాత్రం వర్షాలు

Wait 5 sec.

తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. ప్రజలు అల్లాడిపోతున్నారు. రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు నరకాన్ని చూపిస్తున్నాయి. సాధారణంగా రాత్రి వేళల్లో వాతావరణం కొంత చల్లబడుతుందని ఆశించే ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం అసాధారణంగా పెరిగిపోవడంతో రాత్రిపూట కూడా ఉక్కపోత, వేడిగాలులు తీవ్రతరమయ్యాయి. దీంతో జనం రాత్రిళ్లూ నిద్రపోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే చాలా ఎక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. రామగుండంలో 2.2 డిగ్రీలు పెరిగి అత్యధికంగా 31.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాత్రి వేళ ఈ స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఆదిలాబాద్‌లో 30.2 డిగ్రీలు, హకీంపేటలో సాధారణం కంటే 4.3 డిగ్రీలు పెరిగి 29.3 డిగ్రీలు, హైదరాబాద్‌లో 2.3 డిగ్రీల పెరుగుదలతో 29 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మరో రెండు రోజుల పాటు రాత్రి వేళల్లో ఇదే విధమైన ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు కూడా రికార్డులను తిరగరాస్తున్నాయి. మంగళవారం పగటిపూట ఖమ్మం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4.2 డిగ్రీలు అధికంగా నమోదై 44.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. భద్రాచలంలో కూడా సాధారణం కంటే 3 డిగ్రీలు పెరిగి 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతతో పాటు గాలిలో తేమ శాతం కూడా ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మెదక్ మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో గాలిలో తేమ శాతం 43 డిగ్రీల లోపే నమోదవడం గమనార్హం.ఈ తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వడదెబ్బకు గురై మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 45 మంది మరణించారు. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 17 మంది ప్రాణాలు కోల్పోగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 16 మంది మృతి చెందారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఐదుగురు, ఉమ్మడి కరీంనగర్‌లో నలుగురు, ఉమ్మడి నల్గొండలో ఇద్దరు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకరు వడదెబ్బ కారణంగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు, ఎండల్లో పనిచేసే కార్మికులే ఉండటం గమనార్హం.రాష్ట్రంలో నెలకొన్న ఈ భయానక పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ బుధవారం పది జిల్లాలకు 'ఆరెంజ్' హెచ్చరికలు జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు. అయితే, ఎండలతో తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రజలకు ఐఎండీ స్వల్ప ఉపశమన వార్తను కూడా అందించింది. గురువారం వరకు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.