ఫైనల్‌లోకి రాయల్ ఎంట్రీ ఇచ్చింది. టాస్ అనుకూలంగా లేకపోయినా.. వచ్చిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకుని ధర్మశాలలో బౌండరీల వర్షం కురిపించారు. సిక్సర్లు, ఫోర్లతో కాసేపు సునామీ సృష్టించి 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయడమే కాకుండా.. క్వాలిఫైయర్ 1 లాంటి కీ మ్యాచ్‌లో ఫుల్ డామినేషన్‌తో 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, ఇదంతా ఆ జట్టు కెప్టెన్ వల్లే సాధ్యమైంది. కీలక మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో రజత్ పటిదార్ చూయించాడు. విరాట్ కోహ్లి అవుటైన తర్వాత 9వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన రజత్ పటిదార్.. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడకుండా చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నిలబెట్టుకుంటూ వచ్చాడు. విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ ఇద్దరూ ఒకే ఓవర్‌లో అవుటవ్వడంతో ఒక్కసారిగా కష్టాల్లో పడింది. 9వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన రజత్ పటిదార్ 13వ ఓవర్ వరకూ పెద్దగా పరుగులేమీ చేయలేదు. 13వ ఓవర్ ముగిసే సమయానికి రజత్ పటిదార్ 10 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. 8 ఓవర్ల సమయానికి 92 పరుగులు ఉన్న ఆర్సీబీ స్కోర్.. 13వ ఓవర్ సమయానికి కేవలం 128 పరుగులు మాత్రమే. 14వ ఓవర్‌లో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆ ఓవర్‌లో రజత్ పటిదార్ తొలి రెండు బంతుల్లో 6 పరుగులు చేశాడు, మూడో బంతిని బౌండరీగా మారుద్దామని ప్రయత్నించి క్యాచ్ ఇవ్వగా.. కగిసో రబడా దాన్ని వదిలేశాడు. ఇక అప్పటి నుంచి రజత్ పటిదార్ విధ్వంసం మొదలైంది. క్యాచ్ డ్రాప్ చేసే సమయానికి రజత్ పటిదార్ 13 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేశాడు. అప్పటికి జట్టు స్కోర్ 14 ఓవర్లలో 140/3గా ఉంది. ఆఖరి ఆరు ఓవర్లలో రజత్ పటిదార్ తన రప్పా రప్పా బ్యాటింగ్‌ని చూయించాడు. సిక్సర్లు, ఫోర్లతో గ్రౌండ్ నలుమూలలా బౌండరీలు బాదాడు. ఆఖరి 22 బంతుల్లో ఏకంగా 77 పరుగులు బాదాడు. ఆ క్యాచ్ మిస్ చేసినప్పటి నుంచి రజత్ పటిదార్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఏ బంతి వేసినా బౌండరీ వైపే వెళ్తుంది. మొత్తం 33 బంతులు ఆడిన రజత్ పటిదార్ ఐదు ఫోర్లు, 9 సిక్సర్లతో 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రజత్ పటిదార్ విధ్వంసానికి ఆర్సీబీ స్కోర్ 254/5గా చేరింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించిన పటిదార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రజత్ పటిదార్ ఈ సీజన్‌లో ఐదు హాఫ్ సెంచరీలతో 486 పరుగులు చేశాడు.