ఫార్మాట్ ఏదైనా పరుగుల రికార్డు మాత్రం కోహ్లిదే. అప్పట్లో సచిన్.. ఇప్పుడు విరాట్ కోహ్లి. ఈ మాట చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే పరుగుల దాహం అంత ప్రత్యేకమైనది. ఛేజ్ మాస్టర్ చీకూ ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కోహ్లి ఇప్పుడు ఇంకో రికార్డును క్రియేట్ చేశాడు. గత నాలుగు సీజన్‌లుగా 600కు పైగా పరుగులతో విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 2023 నుంచి 2026 వరకు జరిగిన నాలుగు సీజన్‌లలో వరుసగా 600కు పైగా పరుగులు చేసి రియల్ గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని నిరూపిపంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌తో విరాట్ కోహ్లి ఈ సీజన్‌లో 600 మార్కును దాటేశాడు. 37 సంవత్సరాల విరాట్ కోహ్లి క్రికెట్‌లో ఇంకా యువకుడే. యువ క్రికెటర్లకు ఏమాత్రం తగ్గకుండా స్కోర్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఐపీఎల్ ఓవరాల్ రికార్డులలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 9261 పరుగులతో విరాట్ కోహ్లి మొదటి స్థానంలో నిలిచాడు. అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్లలో కూడా 835 బౌండరీలతో విరాట్ కోహ్లి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లి కెరీర్‌లో ఇప్పటి వరకు ఆరు సార్లు 600కు పైగా పరుగులు చేస్తే.. అందులో వరుసగా గత నాలుగేళ్లలో నాలుగు సార్లు 600 మార్క్ అందుకోవడం విశేషం. 2013లో తొలిసారిగా 634 పరుగులు చేసిన కోహ్లి, 2016లో 973 పరుగులతో ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఆ స్కోర్‌ను ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా అధిగమించలేకపోయాడు. గత నాలుగేళ్లలో విరాట్ కోహ్లి ట్రాక్ రికార్డును పరిశీలిస్తే 2023లో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో 639 పరుగులు చేశాడు. 2024లో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 741 పరుగులు, 2025లో ఎనిమిది హాఫ్ సెంచరీలతో 657 పరుగులు చేయగా.. ఈ ఏడాది ఫైనల్‌కు ముందు 1 సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 600 పరుగులు చేశాడు. ఇందులో 2024లో ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లిలా ఇలా వరుసగా నాలుగు సంవత్సరాల్లో 600కు పైగా స్కోర్ చేసిన మరో బ్యాటర్ లేడు. అయితే టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 2023లో 890, 2025లో 650, 2026లో 618 పరుగులు చేయగా.. 2024లో మాత్రం కేవలం 426 పరుగులే చేసి.. కోహ్లికి అతి దగ్గరగా వెళ్లాడు.