అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకునే సమయంలో ప్లేయర్లే చేతులెత్తేశారు. టాస్ కూడా గుజరాత్‌కే అనుకూలంగా రావడంతో ధర్మశాలలో టఫ్ ఫైట్ జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ, చెత్త ఫీల్డింగ్ కారణంతో క్వాలిఫైయర్ 1లో మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా రజత్ పటిదార్ క్యాచ్ డ్రాప్ మ్యాచ్ సినారియోను మొత్తం మార్చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మొత్తం మూడు క్యాచ్‌లు వదిలేసింది.ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ ఫీల్డింగ్ మిస్టేక్‌తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. క్యాచ్‌లతో పాటు ఫీల్డింగ్ మిస్టేక్, రనౌట్ ఛాన్స్‌లను కూడా గుజరాత్ ఫీల్డర్లు వదిలేశారు. వెంకటేశ్ అయ్యర్ క్యాచ్‌ని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంత అద్భుతంగా పట్టుకుని మంచి ఆరంభం ఇచ్చినా.. ఆ తర్వాత వరుసగా ఫీల్డింగ్ మిస్టేక్‌లతో మ్యాచ్ చేజారిపోయింది. గుజరాత్ టైటాన్స్ అత్యంత కాస్ట్లీ ఫీల్డింగ్ మిస్టేక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ క్యాచ్ వదిలేయడం. మ్యాచ్ 14వ ఓవర్‌లో ప్రసిద్ధ్ క‌ృష్ణ బౌలింగ్‌లో రజత్ పటిదార్ గాల్లోకి బంతిని లేపాడు. అది నేరుగా కగిసో రబడా చేతుల్లోకి వెళ్లింది. ఇక పటిదార్ అవుటయ్యాడని అందరూ అనుకున్నారు. తీరా చేతుల్లో పడిన క్యాచ్‌ని రబడా వదిలేశాడు. ఆ క్యాచ్ వదిలేయడం ఎంత ప్రమాదకరమో మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మాత్రం తెలియలేదు. క్యాచ్ వదిలేసే సమయానికి రజత్ పటిదార్ 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఆ సమయంలో ఆర్సీబీ 14 ఓవర్లలో 140/3తో కొనసాగుతోంది. రజత్ పటిదార్ క్యాచ్ ఎప్పుడైతే వదిలేశారో.. ఆఖరి ఆరు ఓవర్లలో ఏకంగా 114 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. రజత్ పటిదార్ కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నమోదు చేశాడు. దాంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 254/5 పరుగులు చేసింది. కీలక సమయంలో రజత్ పటిదార్ క్యాచ్ వదిలేయడం.. ఆ తర్వాత పటిదార్ విధ్వంసంతో ఐదు ఫోర్లు, 9 సిక్సర్లతో ధర్మశాలలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ ఒక్క క్యాచ్ వదిలేయడంతో గుజరాత్ టైటాన్స్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో గుజరాత్ 162 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 2కి వెళ్లింది.