టీ-వాలెట్ యూజర్లకు అలర్ట్.. ప్రమాదంలో 16 లక్షల మంది డేటా.. హైకోర్టుకు నివేదించిన పోలీసులు

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక డిజిటల్ చెల్లింపుల యాప్ టీవాలెట్ (T-Wallet) చుట్టూ తీవ్రమైన డేటా భద్రత, మోసం వివాదం ముసురుకుంది. యాప్‌ను గతంలో నిర్వహించిన ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పౌరుల అత్యంత కీలకమైన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందని, ప్రభుత్వ రికార్డులను, వ్యవస్థలను చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తోందని సైబర్ క్రైమ్ పోలీసులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో సంచలన విషయాలను వెల్లడించారు. ఈ కబ్జా, డేటా ఉల్లంఘన కారణంగా దాదాపు 16 లక్షల మంది ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ప్రమాదంలో పడిందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2016 నాటి పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు, సుమారు 1200 పౌర సేవలను సులభతరం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా సంస్థకు 2017లో టీవాలెట్ యాప్ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఇందుకోసం ప్రభుత్వం యాప్ అభివృద్ధికి రూ.70 లక్షలు కేటాయించడంతో పాటు నిర్వహణ ఖర్చుల కింద మరో రూ.49.5 లక్షల వరకు చెల్లించింది. రెండేళ్లకోసారి ఈ ఒప్పందాన్ని పొడిగిస్తూ రాగా.. పాత ఒప్పందం గడువు గతేడాది 2025 మే 31 తో ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం అంతర్జాతీయ టెండర్లు పిలవగా.. టీవాలెట్ తదుపరి నిర్వహణ బాధ్యతల కోసం పర్‌వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పీ అనే కొత్త సంస్థ ఎంపికైంది.అయితే, మునుపటి ఒప్పందం ప్రకారం పాత సంస్థ తమ వద్ద ఉన్న పౌరుల సమాచారం, యాప్ మౌలిక సదుపాయాల నియంత్రణ, సోర్స్ కోడ్, అనుబంధ వ్యవస్థలను కొత్తగా ఎంపికైన సంస్థకు పూర్తిగా బదలాయించాల్సి ఉంది. కానీ ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ ఇందుకు నిరాకరిస్తూ పౌరుల డేటాను తన వద్దే అక్రమంగా ఉంచుకుంది. అంతటితో ఆగకుండా.. ప్రభుత్వానికి చెందిన టీవాలెట్ యాప్ తనదేనంటూ ఖాతాదారులను తప్పుదోవ పట్టిస్తూ కొత్తగా టీఏ వాలెట్ అనే యాప్‌ను సృష్టించి 16 లక్షల మంది పాత వినియోగదారులను మోసపూరితంగా అందులోకి మళ్లించేందుకు ప్రయత్నించింది. ఈ విషయమై ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆర్బీఐ.. వినియోగదారుల స్పష్టమైన అనుమతి లేకుండా ఎలాంటి డేటా బదలాయింపునకు వీల్లేదని స్పష్టం చేసింది.ఈ తీవ్రమైన అక్రమాలపై మీసేవ ఫైనాన్స్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో సీసీఎస్ పోలీసులు సదరు కంపెనీపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌లో కంపెనీ చేస్తున్న మోసాలను ఆధారాలతో సహా వివరించారు. సదరు కంపెనీ ప్రభుత్వానికి వివిధ సేవల ద్వారా దాదాపు రూ.14 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆ సొమ్మును కూడా నొక్కేసేందుకే ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని పోలీసులు పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ కేసులో కంపెనీతో పాటు దాని మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కాటూరి శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ చీఫ్ ఎం. శ్రీనివాసులు, మేనేజర్ పి. కిరణ్‌కుమార్‌లను నిందితులుగా చేర్చినట్లు పోలీసులు వివరించారు. కేసు దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని నిందితుల కస్టడీ ద్వారా ప్రజల కీలక సమాచారాన్ని ప్రభుత్వ యాప్ కోడ్‌లను సురక్షితంగా రాబట్టాల్సి ఉందన్నారు. పక్కా ప్రణాళికతో పౌరుల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాన్ని మోసగించిన ఈ సంస్థ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను వెంటనే కొట్టివేయాలని కేసు దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతించాలని పోలీసులు హైకోర్టును అభ్యర్థించారు.