దారిలో నడుస్తూ వెళ్తుంటే మీకో పది రూపాయలు కాగితం కనిపించిందని అనుకోండి.. ఏం చేస్తారు.. ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఇది మీదేనా అని అడుగుతాం. అదే వంద రూపాయల నోటు కనిపిస్తే.. అడగడానికి సందేహిస్తాం, జేబులో వేసుకునే ప్రయత్నం చేస్తాం.. అదే రూ.500 కాగితమైతే మరో ఆలోచనే లేదు. దొరికిందే ఛాన్స్ అని కైవసం చేసుకుంటాం. ఇందులో తప్పుబట్టడానికేమీ లేదు. అది సహజ మానవ నైజం. కరెన్సీ నోటు విలువ పెరిగే కొద్దీ.. మనిషిలో నైతిక విలువలు అంతగా పడిపోతాయి. వందా, వేయి కాదు ఏకంగా రూ.20 లక్షల విలువైన బంగారం కనిపిస్తే ఏం చేస్తారు.. చప్పుడు చేయక బ్యాగ్ సర్దుకుని, తెలిసిన నగల షాపుకో, మార్వాడీ వద్దకో వెళ్లి నగదులోకి మార్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ తూర్పు గోదావరి జిల్లా మండపేటకు నామాల లక్ష్మణ్ అనే వ్యక్తి అలా కాదు.లక్షల విలువైన బంగారం తనకు దొరికినా, పరుల సొమ్ము పామువంటిదని భావించి.. నలుగురికి ఆదర్శంగా నిలిచే పనిచేశారు.ఏడిద సీతానగరానికి చెందిన పేరిచెర్ల శ్రీలేఖ.. మే 24వ తేదీ కుటుంబసభ్యులతో కలిసి ఓ శుభకార్యానికి వెళ్లారు. అందరూ కలిసి ఆటోలో వెళ్లే సమయంలో నగల బ్యాగు పోయింది. ఏడిద గ్రామ శివార్లలోని దేవుడు కాలనీ సమీపంలో రూ. 20 లక్షల విలువైన ఉన్న నగల బ్యాగు పడిపోయింది. అయితే ఈ బ్యాగు ఏడిద గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి దొరికింది. బ్యాగ్ ఓపెన్ చేసి చూసిన అతను షాక్ తిన్నాడు. బ్యాగులో కనిపించాయి. అయితే వాటిని పోగొట్టుకున్న వారికే తిరిగి అందజేయాలని లక్ష్మణ్ నిర్ణయించుకున్నారు. అయితే ఎలా వాటిని అందజేయాలో తెలియలేదు, మరోవైపు అప్పటికే బ్యాగ్ పోగొట్టుకున్న కంగారులో ఉన్న శ్రీలేఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నగల బ్యాగ్ తనవద్ద ఉందంటూ లక్ష్మణ్ పోలీసులకు తెలిపారు మే 24వ తేదీనే తనకు నగల బ్యాగు దొరికిందని, అయితే ఎలా తిరిగి ఇవ్వాలో తెలియక తన వద్దే ఉంచుకున్నట్లు లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పోలీసులకు అప్పగించారు. అనంతరం మండపేట గ్రామీణ సీఐ, ఎస్‌ఐలు బ్యాగులోని ఆధార్‌కార్డు సాయంతో శ్రీలేఖకు సమాచారం అందించారు. దీంతో పోయిందనుకున్న బంగారం తిరిగి దొరికిందంటూ సంతోషంతో ఆమె పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అనంతరం పోలీసుల సమక్షంలో లక్ష్మణ్ నగలబ్యాగును శ్రీలేఖకు అందజేశారు. విలువైన బంగారు నగలను భద్రంగా అప్పగించిన లక్ష్మణ్‌ను పోలీసులు, స్థానికులు, అభినందించారు. శ్రీలేఖ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.