డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్.. కర్ణాటక సీఎల్పీ నేతగా ఏక్రగీవంగా ఎన్నిక

Wait 5 sec.

ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే ఆశ ఎట్టకేలకు నెరవేరబోతోంది. శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశంలో ఆయనను ఎమ్మెల్యేలు తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే పేరును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించారు. ఆయనకు ఎమ్మెల్యేలంతా మద్దతు తెలపడంతో డీకే ఎన్నిక ఏకగ్రీవమైంది. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన కర్ణాటక వ్యవహారాల ఇంఛార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో సమక్షంలో సీఎల్పీ నేత ఎన్నిక జరిగింది. అనంతరం డీకే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పరిశీలకులు ప్రకటించారు.ఎటువంటి నాటకీయ పరిణామాలకు చోటులేకుండా కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. కాంగ్రెస్‌కు చెందిన 138 మంది ఎమ్మెల్యేలు హాజరై.. డీకేను ఎన్నుకున్నారు. అయితే, జూన్ 3న శివకుమార్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్లే ఉండటంతో డీకే నాయకత్వంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి క్యాబినెట్ కూర్పుపై ఇబ్బంది ఎదురవకూడదనేది కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రెండు మూడ్రోజుల్లోనే పాలనను పరుగులు పెట్టించాలన్నది హైకమాండ్ లక్ష్యం. ఇందు కోసమే ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి మంత్రివర్గ కూర్పుపై ముమ్మర కసరత్తు చేశారు. క్యాబినెట్ కూర్పుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డీకే చెప్పినా.. వడబోత పూర్తయినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గమంతా ప్రమాణస్వీకారం చేస్తుందా? లేదంటే సాంకేతికంగా ఐదారుగురు బాధ్యతలు తీసుకుంటారా? అన్నది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. మంత్రివర్గంలో ఇప్పటికే సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రకు బెర్త్‌ను ఖాయం చేసుకోగా ఆయన క్యాబినెట్‌లు మంత్రులంతా మరోసారి చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా, సీఎల్పీ సమావేశానికి బయలుదేరి వెళ్తుండగా... డీకే శివకుమార్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ముఖ్యమంత్రిగా జూన్ 3న ప్రమాణస్వీకారం చేయనున్నారా? అడిగితే 'థర్డ్ థర్డ్' అంటూ డీకే బదులిచ్చారు.