రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఒక రోజు ముందుగానే ప్రీమియర్లు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా టీమంతా దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. హీరో హీరోయిన్లతో పాటుగా కీలక పాత్రలు పోషించిన నటీనటులు, సినిమాకి పని చేసిన టెక్నిషియన్స్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు 'భారతీయ జనతా పార్టీ' కూడా ‘పెద్ది’ ప్రచార పర్వంలో భాగమవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘పెద్ది’ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర బృందం.. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి రామ్ చరణ్, జాన్వీ కపూర్, బొమన్‌ ఇరానీ, దివ్యేందు శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా చరణ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. గతంలో ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు 'పెద్ది' సినిమా గురించి అడిగారని, ఒక విధంగా వికసిత్ భారత్ తరహా కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా అని తాను చెప్పినట్లు చెర్రీ వెల్లడించారు. అప్పుడు వెస్ట్ బెంగాల్ లో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన మొహమ్మద్ అనే ఫుట్ బాల్ ప్లేయర్ స్ఫూర్తిదాయకమైన కథను మోదీ తనకు వివరించారని చరణ్ తెలిపారు.''పశ్చిమ బెంగాల్‌లో మోదీజీ ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది యువకులు జెర్సీ ధరించి, కింద లంగోటా వేసుకొని కనిపించారు. వాళ్లంతా ఒక మారుమూల గ్రామానికి చెందినవారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఆ గ్రామం నుంచి మొహమ్మద్ అనే ఫుట్‌ బాల్ ప్లేయర్ భారత జట్టుకు ఆడాడు. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి 80 శాతం మంది యువకులు ఫుట్‌ బాల్ ఆడుతున్నారని మోదీ నాతో చెప్పారు. ఒక్క వ్యక్తి స్ఫూర్తి ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదు అనడానికి ఇదొక నిదర్శనం. ‘పెద్ది’ కూడా అలాంటి కథే. ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు, తన ఐడెంటిటీ కోసం ఎలా పోరాడు అనేది ఈ చిత్రంలో చూపించాం'' అని రామ్ చరణ్ చెప్పారు. 'పెద్ది' సినిమాపై మోదీతో జరిగిన సంభాషణ గురించి రామ్ చరణ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెద్ది సిమిమా ప్రధాని దృష్టిలో పడిందని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. చిత్ర బృందం సైతం ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తోంది. బీజీపీ పార్టీ సైతం చరణ్ చెప్పిన విషయాన్ని ప్రమోట్ చేస్తోంది. బీజీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు కూడా ఈ వీడియోలను షేర్ చేస్తూ, పరోక్షంగా 'పెద్ది' సినిమాకి కూడా ప్రచారం కల్పిస్తున్నారు. ఏకంగా BJP పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ లో రామ్ చరణ్ ఢిల్లీ ప్రెస్ మీట్ లో మాట్లాడిన వీడియోని పోస్ట్ చేశారు. ''యాక్టర్ రామ్ చరణ్ తన రాబోయే చిత్రం 'పెద్ది' గురించి ప్రధానమంత్రి మోదీతో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. 'గతంలో నేను ఢిల్లీలో మన గౌరవనీయ ప్రధానమంత్రి మోదీ గారిని కలిసినప్పుడు, 'పెద్ది' కథాంశం ఏమిటని ఆయన నన్ను అడిగారు. అది ఒక పరిణితి చెందిన భారతదేశం గురించి, అలాగే మన గ్రామాలను సాధికారిత వైపు నడిపించడం గురించి ఉంటుందని నేను ఆయనకు వివరించాను' అని చరణ్ చెప్పారు. ఒక తెలుగు సూపర్ స్టార్‌కి ప్రధానమంత్రి మోదీ స్వయంగా వివరించిన, పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన ఆ కథను ఇక్కడ మీరూ వినండి'' అని బీజీపీ పేర్కొంది. దీనిపై 'పెద్ది' టీమ్ స్పందిస్తూ.. ''ఇది సార్ మీ రేంజ్'' అంటూ చరణ్ ను ట్యాగ్ చేసింది. కాసేపటికే ట్వీట్ డిలీట్ చేసింది. ఇక భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి స్పందించారు. ''బలమైన, సాధికారత కలిగిన భారతదేశపు దార్శనికతను సినిమా ప్రతిబింబించడం చూసి గర్వంగా ఉంది. 'పెద్ది' సినిమా ద్వారా గ్రామ సాధికారత, అభివృద్ధి చెందిన దేశం గురించిన కథలను రామ్ చరణ్ గారు తెరపైకి తీసుకురావడం నిజంగా స్ఫూర్తిదాయకం. ప్రధాని నరేంద్ర మోదీజీతో జరిగిన ఈ సంభాషణ.. కళ, నాయకత్వం కలిసి భారతదేశ భవిష్యత్తు కోసం సానుకూల మార్పును ఎలా ప్రేరేపించగలవో చూపిస్తుంది'' అని విష్ణు వర్ధన్ ఎక్స్ లో పేర్కొన్నారు.ట్విట్టర్ (X)లో 23 మిలియన్స్, ఇన్స్టాగ్రామ్ లో 9.4 మిళియన్ల ఫాలోవర్స్ ఉన్న బీజీపీ పార్టీ.. 'పెద్ది' సినిమాకు సంబంధించిన వీడియో షేర్ చేయడం.. దాన్ని బీజీపీ లీడర్స్, ఫాలోవర్స్ ప్రమోట్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇది రామ్ చరణ్ సినిమాకి పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్స్ కి కలిసొస్తుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పెద్ది సినిమా ప్రచారానికి బాగా హెల్ప్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అందులోనూ బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ తో సహా పలువురు యాక్టర్స్ ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ కి నేషనల్ అవార్డ్ రావడం గ్యారంటీ అని ఎలివేషన్లు ఇస్తున్నారు. కాబట్టి కంటెంట్ క్లిక్ అయితే మాత్రం, ఈసారి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో పాటుగా చెర్రీకి జాతీయ పురష్కారం వస్తుందనే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. 'పెద్ది' సినిమాకి కోరుకున్న విధంగా టికెట్ రేట్లు, స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. బీజేపీ, పార్టీ లీడర్స్ కూడా ఈ సినిమాకి ప్రచారం కల్పిస్తున్నారు. మరి ఇదంతా 'పెద్ది' చిత్రానికి ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి.