తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. . ఉదయం 10 గంటలు దాటితే జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రమైనా సరే వేడి తీవ్రత తగ్గడం లేదు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్తున్నవారు, కూలీలు, వయసు పైబడిన వారు వడదెబ్బతో అనారోగ్యం బారిన పడుతున్నారు. కొందరైతే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణలో ఆదివారం ఒక్క రోజే 42 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలోకి వచ్చే పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ సోమవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది.రాష్ట్రంలో మూడు రోజుల్లోనే 100 మందికిపైగా వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. రోహిణి కార్తె ప్రభావంతో మే 25 నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.రూ.4 లక్షల పరిహారం..కాగా వడదెబ్బతో మరణిస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలు రూ.4 లక్షల పరిహారం పొందొచ్చు. గతంలో ఈ పరిహారం రూ.50 వేలు మాత్రమే ఉండేది. అయితే వడదెబ్బను విపత్తుగా గుర్తించిన ప్రభుత్వం పరిహారాన్ని పెంచింది. అయితే వడదెబ్బ కారణంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు పరిహారం పొందేందుకు కొన్ని కీలక పత్రాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.పరిహారం పొందడానికి ఇవి తప్పనిసరి..తమ కుటుంబ సభ్యుడు వడదెబ్బతో చనిపోయాడని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అలాగే స్థానికంగా ఉండే ఆరోగ్య కార్యకర్త లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి, రెవిన్యూ సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వాలి. వడదెబ్బ వల్లే చనిపోయాడని నిర్ధారించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలి.ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్), పోస్టుమార్టం రిపోర్ట్, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలను తీసుకొని స్థానిక తహసీల్దార్ ఆఫీసులో లేదా జిల్లా కలెక్టర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మార్వో, వైద్యాధికారి, ఎస్సైతో కూడిన కమిటీ విచారణ జరిపి.. వడదెబ్బతోనే సదరు వ్యక్తి మరణించాడని జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇస్తుంది. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ విపత్తు సహాయక నిధి ద్వారా పరిహారం మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.వడదెబ్బ నుంచి కాపాడుకోండి ఇలా..వడ దెబ్బ తగలకుండా ఉండటం కోసం ఎక్కువగా నీరు తాగాలి. దాహం వేయకపోయినా తరచుగా మంచి నీళ్లు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఓఆర్ఎస్ లాంటివి తాగడం ద్వారా శరీరం చెమట రూపంలో కోల్పోయే ఖనిజ లవణాలను భర్తీ చేసుకోవచ్చు. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. వదులుగా, లేత రంగులో ఉండే కాటన్ దుస్తులు ధరించడం, బయటకు వెళ్లినప్పుడు గొడుగు, టోపీ వాడటం చేయాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది.