ప్రముఖ సినీ గేయ రచయిత తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తమ భూమిని ఆక్రమించారంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన అర్జీ సమర్పించారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారని, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థల వివాదం కోర్టులో ఉందని, తమపై ఒత్తిడి తెస్తూ ఇబ్బందులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వృద్ధులైన తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని అనంత శ్రీరామ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి వినతిపత్రం అందించారు.