కొత్త ప్రభుత్వం కొలువు దీరిన కొద్ది రోజులకే తమిళనాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు వారాల క్రితమే ఎమ్మెల్యేలు ప్రమాణం చేయగా.. వారిలో ముగ్గురు నేడు (సోమవారం) రాజీనామా చేశారు. పెరుందురై ఎమ్మెల్యే ఎస్.జయకుమార్, మధురాంతకం (ఎస్సీ రిజర్వ్‌డ్) ఎమ్మెల్యే మరగతం కుమారవేల్, ధరపురం (ఎస్సీ రిజర్వ్‌డ్) ఎమ్మెల్యే పి.సత్యభామ తమ పదవులకు రాజీనామా చేశారు. అన్నాడీఎంకేకు చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు తమ రాజీనామా లేఖలను సమర్పించగా.. స్పీకర్ వెంటనే ఆమోదం తెలిపారు. షణ్ముగం సారథ్యంలోని అన్నాడీఎంకే రెబల్ వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన సంగతి తెలిసిందే. వారిలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.టీవీకే చీఫ్ కోఆర్డినేటర్, మంత్రి కేఏ సెంగొట్టాయన్ ఇచ్చిన మాట ప్రకారం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రానున్న ఉపఎన్నికల్లో మళ్లీ మిమ్మల్నే బరిలోకి దింపుతామని టీవీకే నుంచి వారికి హామీ వచ్చిందని సమాచారం.ధరపురం, పెరుందురై నియోజకవర్గాలు.. అన్నాడీఎంకేకు కంచుకోట లాంటి పశ్చిమ తమిళనాడులోని కొంగు ప్రాంతంలో ఉంటాయి. మధురాంతకం నియోజకవర్గం చెన్నై నగరానికి చేరువగా ఉంటుంది. తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే కీలక నేత, మంత్రి ఆధవ్ అర్జునను ఆయన చాంబర్లో కలిశారు.అయితే అన్నాడీఎంకే రెబల్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పడి పళనిస్వామిని కలిశారు. తిరిగి పార్టీతో కలిసిపోతామని వీరు సంకేతాలు ఇచ్చారు. పి.హరిబాస్కర్, ఎస్.మోహన్, ఎస్ఎం సుగుమార్ అనే ముగ్గురు ఎమ్మెల్యేలు పళనిస్వామిని ఆయన నివాసంలో కలిశారు.మే 4న వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే 108 సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్టులు తదితర చిన్న పార్టీల మద్దతుతో . బలపరీక్ష సమయంలో అన్నాడీఎంకే రెబల్ వర్గం కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో ఆయన సునాయాసంగా బలపరీక్షలో నెగ్గారు. అయితే కీలక నిర్ణయాలు తీసుకోవడానికి విజయ్ మిత్ర పక్షాలపై అతిగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి.. వారిని టీవీకే తరఫున పోటీ చేయించి గెలిపించుకొని.. అసెంబ్లీలో సొంతంగానే పూర్తి బలాన్ని పొందాలనేది విజయ్ వ్యూహంగా కనిపిస్తోంది.