తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.. ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఒకే నెలలో రెండుసార్లు

Wait 5 sec.

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు భారీగా కానుకలు, విరాళాలు అందజేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు ఇటీవల కాలంలో భారీగా విరాళాలు ఇస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. ప్రముఖ వ్యాపార సంస్థ జీఆర్‌టీ గ్రూప్‌ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందించారు. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో తమిళనాడు, పుదుచ్చేరి విభాగ ఏఈవో ధనుంజయ్‌కు జీఆర్‌టీ గ్రూప్‌ ఛైర్మన్‌ జి.రాజేంద్రన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీఆర్‌ అనంతపద్మనాభన్‌ రూ.2 కోట్ల మొత్తాన్ని విరాళం చెక్కు అందించారు. ఈ నెల 13న ఈ సంస్థకు చెందినవారు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.2 కోట్లు అందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జీఆర్‌టీ సంస్థకు జ్యువెలరీ షాపులతో పాటుగా మరికొన్ని వ్యాపారాలు ఉన్నాయి. జీఆర్‌టీ ఈ నెలలో మొత్తం రూ.4కోట్లు విరాళంగా ఇచ్చారు.టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.30 లక్షలు విరాళంగా అందింది. తిరుపతికి చెందిన కోరా సౌమ్య రూ.10,00,116, బిరుదాల సతీష్ కుమార్ రెడ్డి రూ.10,00,116, శ్రీ పూరాబ్ సాయి రూ.10 లక్షలు ట్రస్టుకు అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీ, చెక్కులను అందజేశారు. గుంటూరుకు చెందిన మాదాల శేషగిరిరావు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. అదేవిధంగా గుంటూరుకు చెందిన వడ్లమూడి మిత్రేష్ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,111 విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలుతిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అభయప్రదాతగా వెలుగొందారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా.. చెక్కభజనలు, కోలాటాలు, గోవింద నామస్మరణలతో తిరుపతి మాడవీధులు మారుమోగాయి. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవను తిలకించిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి దివ్యానుభూతిని పొందారు.బ్రహ్మవాహనమైన హంస జ్ఞానానికి, వివేకానికి ప్రతీకగా పురాణాలు పేర్కొంటాయి. పాలను నీటిని వేరుచేసే హంస స్వభావం ఆత్మానాత్మ వివేకానికి సంకేతం. అందుకే పరమాత్మతో ఏకత్వం పొందిన మహనీయులను “పరమహంసులు”గా ఉపనిషత్తులు అభివర్ణించాయి. భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తిని ప్రసాదించేందుకే శ్రీహరి హంసవాహనాన్ని అధిరోహిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.