వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ బ్యాటింగ్ అందర్నీ ఆకట్టుకుంది. క్రీజులోకి వచ్చిన తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలుపెట్టిన హార్దిక్ 10 బంతుల్లోనే 30 పరుగులు నమోదు చేశాడ. అయితే, ఫోర్.. సిక్సర్ కొట్టిన ప్రతిసారీ హార్దిక్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది. హార్దిక్‌ను చూసి ప్రేక్షకులతో పాటు రోహిత్ శర్మ కూడా అవాక్కయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌కు డూ ఆర్ డై మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కాసేపు టెన్షన్ పుట్టించాడు. విల్ జాక్స్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా.. మొదటి బంతినే గాల్లోకి లేపాడు. అయితే, కెప్టెన్ రియాన్ పరాగ్ క్యాచ్ అందుకోవడంలో విఫలం కావడంతో తొలి బంతికే లైఫ్ వచ్చింది. దాంతో రెండో బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి పంపించాడు. అదే ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. అయితే, సిక్సర్ బాదిన తర్వాత హార్దిక్ పాండ్యా ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దాసున్ శనక వేసిన బౌలింగ్‌లో హార్దిక్ ఎలా కొట్టినా బౌండరీలు వెళ్లడం విశేషం. గ్యాప్ షాట్స్ ఆడిన హార్దిక్ పాండ్యా బంతి వెళ్తున్న వైపు చూయిస్తూ అదిగో బాల్ అన్నట్టు సెలబ్రేట్ చేశాడు. ఇలా ప్రతిసారీ చేస్తుండటంతో ఫ్యాన్స్, కామెంటేటర్లతో పాటు డగౌట్‌లో కూర్చున్న రోహిత్ శర్మ కూడా నవ్వుకున్నాడు. హార్దిక్ ఏంటి ఇంత జోష్‌లో ఉన్నాడు అని అనుకున్నారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయింది. గతేడాది ముంబై ఇండియన్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన హార్దిక్ పాండ్యా.. ఈ సారి కెప్టెన్‌గా విఫలమయ్యాడు. సీజన్ ముగిసే సమయానికి కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.