Top 10 Valued Firms: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు.. రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. ఇక్కడ తీవ్ర అనిశ్చితి ఉంటుంది. తీవ్ర ఒడుదొడుకులు ఉంటాయి. తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయి. అంటే ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో.. ఏ స్టాక్ ఎప్పుడు పడిపోతుందో ఊహించలేం. ఇక్కడ ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తుంటాయి. కొన్ని స్టాక్స్ అప్పటికప్పుడు భారీగా పెరుగుతుంటాయి.. అదే సమయంలో కొన్ని స్టాక్స్ భారీగా పతనం అవుతుంటాయి. అందుకే వీటిల్లో జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతుండాలి. ఆయా కంపెనీల నుంచి ప్రకటనలు, ప్రణాళికలు, పెట్టుబడి వ్యూహాలు, ఫలితాలు ఇలా అన్నీ గమనిస్తుండాలి. ఇంకా సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లోనే కొనసాగుతున్నాయి. గత వారం ( మే 18- 22) కూడా తీవ్ర ఒడుదొడుకుల మధ్యనే ట్రేడైనా.. మొత్తంగా స్వల్ప లాభాల్ని నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 177.36 పాయింట్లు పెరిగింది. ఈ క్రమంలోనే మార్కెట్ విలువ పరంగా టాప్- 10 కంపెనీల్లో 6 కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ రూ. 74,111.57 కోట్లు పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువను మదుపరుల సంపదగా పరిగణిస్తుంటారు కాబట్టి ఇన్వెస్టర్ల సంపద కూడా ఈ మేరకు పెరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే అన్నింట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. 5 రోజుల్లో రూ. 24,696.89 కోట్లు పెరగ్గా ప్రస్తుతం రూ. 18.33 లక్షల కోట్ల వద్ద ఉంది. రిలయన్స్ షేర్ ధర రూ. 1358 గా ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 19,338 కోట్లు పెరిగి రూ. 8.38 లక్షల కోట్లుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 14 వేల కోట్లు పెరిగి రూ. 9.06 లక్షల కోట్లుగా ఉంది. ఎల్ఐసీ మార్కెట్ విలువ..ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 రోజుల్లో రూ. 9 వేల కోట్లు పెరగడంతో రూ. 5.14 లక్షల కోట్లకు చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,797 కోట్లు పెరగడంతో రూ. 5.70 లక్షల కోట్లుగా ఉంది. లార్సెన్ అండ్ టుబ్రో మార్కెట్ విలువ రూ. 2685 కోట్లు పెరిగి రూ. 5.40 లక్షల కోట్లుగా నమోదైంది. Airtel Mcap:మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ. 20,229 కోట్లు తగ్గగా రూ. 11.40 లక్షల కోట్లకు చేరుకుంది. హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 రోజుల్లో రూ. 16,212 కోట్లు తగ్గగా రూ. 5.17 లక్షల కోట్లుగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ విలువ రూ. 12,784 కోట్లు పెరిగి రూ. 8.76 లక్షల కోట్లకు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ. 2 వేల కోట్లకుపైగా తగ్గి రూ. 11.79 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ విలువ పరంగా టాప్ కంపెనీలు వరుసగా చూస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టుబ్రో, హిందుస్థాన్ యూనిలివర్, ఎల్ఐసీ ఉన్నాయి.