తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు.. కొత్త ట్రైన్ సర్వీసులు, తెలంగాణలో ఆగే స్టేషన్లు ఇవే..

Wait 5 sec.

కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల రైల్వే ప్రయాణికులకు, తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. ఈ జిల్లాల నుంచి నేరుగా తిరుపతికి వెళ్లేందుకు వీలుగా సరికొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తిరుపతి - రక్సల్ - తిరుపతి (ట్రైన్ నంబర్లు 17433 / 17434) మధ్య నడవనున్న ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను జూన్ 1 నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.రైల్వే శాఖ విడుదల చేసిన టైమ్ టేబుల్ ప్రకారం.. తిరుపతి నుంచి రక్సల్ వెళ్లే ట్రైన్ ప్రతి సోమవారం ఉదయం 8.15 గంటలకు తిరుపతిలో ప్రారంభమవుతుంది. ఇది అదే రోజు అర్ధరాత్రి 12.25 గంటలకు పెద్దపల్లి జంక్షన్‌కు, రాత్రి 1.00 గంటకు మంచిర్యాలకు, తెల్లవారుజామున 1.54 గంటలకు కాగజ్‌నగర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రక్సల్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ ప్రతి గురువారం ఉదయం 3.15 గంటలకు రక్సల్‌లో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 1.44 గంటలకు కాగజ్‌నగర్, మధ్యాహ్నం 2.35 గంటలకు మంచిర్యాల, మధ్యాహ్నం 2.58 గంటలకు పెద్దపల్లి జంక్షన్‌కు చేరుకుంటుంది. అనంతరం శనివారం ఉదయం 9.30 గంటలకు ఈ రైలు తిరుపతికి చేరుకుంటుంది. తెలంగాణ పరిధిలో ఈ రైలుకు వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి జంక్షన్లతో పాటు మంచిర్యాల, కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్లలో స్టాప్ సదుపాయం కల్పించారు.ఈ కొత్త రైలు సర్వీసు కేవలం తిరుపతి ప్రయాణికులకే కాకుండా.. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే వారికి సైతం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఈ రైలు ద్వారా జార్ఖండ్ రాజధాని రాంచీ, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లతో పాటు ప్రముఖ నగరాలైన దుర్గ్, గోండియా, బిలాస్‌పూర్, బరౌని, దర్భంగా, సమస్తీపూర్‌లకు ప్రయాణం సుగమం కానుంది. ఈయా రాష్ట్రాల నుంచి జీవనోపాధి, వివిధ పనుల నిమిత్తం వచ్చి కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో స్థిరపడిన వేలాది మంది వలస కార్మికులకు, ఉద్యోగులకు ఇది వరం కానుంది. వీటితో పాటు ఏపీలోని కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని పట్టణాలకు, కర్ణాటకలోని రాయ్‌చూర్‌కు వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది.ఈ కొత్త రైలుతో పాటు పెద్దపల్లి జంక్షన్ మీదుగా తిరుపతికి వెళ్లే భక్తుల కోసం మరికొన్ని రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి గురు, ఆదివారాల్లో కరీంనగర్ - తిరుపతి రైలు రాత్రి 8.05 గంటలకు, ప్రతి శనివారం నాందేడ్ - తిరుపతి రైలు రాత్రి 10.20 గంటలకు పెద్దపల్లి నుంచి తిరుపతికి బయలుదేరుతాయి. అంతేకాకుండా ఇటీవల మే 17న నాందేడ్ - ధర్మవరం - నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడా ప్రారంభమైంది. ఈ రైలు ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటలకు పెద్దపల్లికి చేరుకుని, 10.20 గంటలకు బయలుదేరి శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి ఆదివారం ఉదయం 5.25 గంటలకు ధర్మవరం నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు తిరుపతికి చేరుకుని 10.40కి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇది ఆదివారం అర్ధరాత్రి 11.55 గంటలకు పెద్దపల్లికి వస్తుంది. అదే సమయంలో పెద్దపల్లిలో రాత్రి 12.05 గంటలకు అందుబాటులో ఉండే బల్లార్షా ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రయాణికులు సులభంగా రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, రేచినిరోడ్డు, కాగజ్‌నగర్‌లకు చేరుకోవచ్చని రైల్వే అధికారులు వెల్లడించారు.