IPL 2026 లీగ్ మ్యాచ్‌లు సమాప్తం.. ఏ జట్టు ఏ ప్లేస్‌తో సీజన్‌ను ముగించిందో చూద్దామా!

Wait 5 sec.

మార్చి 28న అట్టహాసంగా ప్రారంభమైన 2026 ఇప్పుడు ఓ ఘట్టానికి చేరుకుంది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ లీగ్ స్టేజ్‌లో ఆఖరి రోజు వరకూ ప్లే ఆఫ్స్ బెర్త్ సస్పెన్స్‌గానే మిగిలింది. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ విజయంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ని ఇంటికి పంపించి, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ సమరంలో ఎక్కువ అంచనాలు పెట్టుకున్న జట్లు పాయింట్స్ టేబుల్ అట్టడుగున నిలిచాయి. ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. పాయింట్ల పట్టిక ప్రకారం మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. మిగతా జట్లు ఇంటిదారి పట్టాయి. మొత్తం పది జట్లు ఆడిన ఈ మెగా ఈవెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ప్లేస్‌లో నిలవగా.. లక్నో సూపర్ జెయింట్స్ అట్టడుగు స్థానంతో సీజన్‌ను ముగించింది. సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలను చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అనూహ్య విజయాలతో పై స్థానాలకు ఎగబాకగా.. తొలి ఏడు మ్యాచ్‌లలో ఓటమే ఎరుగని పంజాబ్, వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడి ఏకంగా ఐపీఎల్ 2026 నుంచే ఎలిమినేట్ కావడం సీజన్‌లోనే బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, గుజరాత్ టైటాన్స్ రెండు, సన్‌‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. అయితే, ఈ మూడు జట్లు 18 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ ఆధారంగా ఆర్సీబీ టాప్‌లో నిలిచింది. ఈ మూడు జట్లు 14 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించాయి. ఇక నాలుగో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది. పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో ఐదో స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో ఆరు, కోల్‌కతా నైట్ రైడర్స్ 13 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాయి. చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో సీజన్‌ను ముగించింది. ఈ సీజన్ నుంచి ముందుగా ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు చెరి 8 పాయింట్లతో తొమ్మిది, పదో స్థానానికి పరిమితమయ్యాయి. లీగ్ మ్యాచ్‌లు ముగియడంతో మే 26 నుంచి ప్లే ఆఫ్స్, మే 31న ఫైనల్స్ జరగనుంది.