ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా పెట్రోలు బంకులు.. సర్కార్ కీలక నిర్ణయం

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో , మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రాల్లో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్న పెట్రోలు బంకులను రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోలు బంకులను ఏర్పాటు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సెర్ప్ ఇప్పటికే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి పనులను వేగవంతం చేసింది.ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో మహిళల ఆధ్వర్యంలో పెట్రోలు బంకులను ప్రారంభించగా అవి విజయవంతంగా నడుస్తున్నాయి. ఇదే ఉత్సాహంతో మిగిలిన జిల్లాల్లోని మరో 39 ప్రాంతాలలో కొత్త బంకుల ఏర్పాటుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం వంటి ప్రముఖ చమురు సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. భూముల గుర్తింపు, లీజు ఒప్పందాలు, వివిధ శాఖల అనుమతులు, లేఅవుట్ల రూపకల్పన, అండర్ గ్రౌండ్ ట్యాంకుల బిగింపు వంటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆదిలాబాద్, వికారాబాద్, వనపర్తి, ఖమ్మం, కుమురంభీం, హనుమకొండ జిల్లాల్లో భూమి చదును చేయడం, ప్రాథమిక నిర్మాణ పనులు మొదలయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో రెండు సంఘాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు లభించగా... కామారెడ్డి, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో లీజు ఒప్పందాలు, అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరికొన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారుల సంస్థ, ఫైర్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖల నుంచి ఎన్‌ఓసీలు తీసుకునే పనులు పురోగతిలో ఉన్నాయి.నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు:మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి మహిళా వారోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్‌ విధానం ద్వారా గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు సాగనున్నాయి. ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదివారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.ఈ వారోత్సవాల కాలంలో గ్రామ, మండల స్థాయిల్లో ఇందిరా మహిళాశక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితో పాటు మహిళల భద్రత, వారి చట్టాలపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్ల స్థాపన, వయోజన విద్యను ప్రోత్సహించే ఉల్లాస్‌ కార్యక్రమం, చిన్నపిల్లల విద్య, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు అమ్మ మాట - అంగన్వాడీ బాట వంటి వినూత్న కార్యక్రమాలను భారీఎత్తున చేపట్టనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఈ మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.