ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ కాంట్రాక్టర్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. 40 ఏళ్లనాటి వివాదం పరిష్కారం అయ్యింది. 1986లో మోహన్‌రావు అనే కాంట్రాక్టర్‌తో నంద్యాల కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌ సంస్థ తమ భవనాల నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. కాంట్రాక్టర్ మోహన్‌రావుకు నంద్యాల కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌ సంస్థ బకాయిలు చెల్లించలేదు. ఈ పెండింగ్ బకాయిలపై కాంట్రాక్టర్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది.. రూ.96 లక్షలు (18శాతం వడ్డీతో కలిపి) చెల్లించాలని ఆదేశించింది. ఆర్బిట్రేటర్‌ ముందు ఈ బకాయిలుకు సంబంధించిన కేసు కొనసాగుతున్నా సమయంలో నంద్యాల కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌ సంస్థ నష్టాల కారణంగా లిక్విడేషన్‌కు చేరింది. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సంస్థలోని కార్మికుల వేతన ప్రయోజనాల్ని కాపాడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రిలీఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (స్పెషల్‌ ప్రొవిజన్స్‌) యాక్ట్‌ 1971 కింద ఓ ముఖ్యమైన జీవో జారీచేసింది. అయితే ఆర్బిట్రేషన్‌ ఇచ్చిన అవార్డును అమలు చేయాలని నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం నంద్యాల కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌ సంస్థ నిర్వహణలో జీవో ద్వారా జోక్యం చేసుకుందని గుర్తు చేశారు.ఒకవేళ తన బకాయిలు చెల్లించేందుకు మిల్లకు సంబంధించిన ఆస్తులు సరిపోకపోతే ప్రభుత్వ ఆస్తులు విక్రయించేలా ఆదేశించాలని కాంట్రాక్టర్ మోహన్‌రావు కోరారు. అక్కడితో ఆగకుండా నంద్యాల సబ్‌కలెక్టర్, తహసీల్దార్‌ కార్యాలయాలను విక్రయించే లిస్ట్‌లో చేర్చాలని దరఖాస్తు కూడా చేశారు. అయితే నంద్యాల కోర్టు కాంట్రాక్టర్ మోహన్‌రావు దరఖాస్తను పరిగణలోకి తీసుకుంది. ఆ వెంటనే ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.. అక్కడ కూడా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. ఈ ఏడాది జనవరిలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. జస్టిస్‌ కేవీ విశ్వనాథన్, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. ఇరువర్గాలూ ఈ బకాయిల అంశంపై చర్చించి ఒప్పందానికి రావాలని సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. అధికారులు కాంట్రాక్టర్‌ మోహన్‌రావుతో సమావేశమై.. వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.2.55 కోట్లు చెల్లించడానికి అంగీకరించారు. ఇంతలో మోహన్‌రావు తనకు రూ.5.64 కోట్లు రావాలని గతవారం మరోసారి సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలిపారు. అనంతరం అన్ని వివరాలను పరిశీలించి చివరికి కాంట్రాక్టర్‌కు రూ.3కోట్లు 8 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొత్తానికి 40 ఏళ్ల నాటి వివాదానికి ముగింపు పలికారు. మొత్తం మీద కాంట్రాక్టర్ మోహన్‌రావు దాదాపు 40 ఏళ్ల పాటూ సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడారు.. తనకు రావాల్సిన బకాయిల్ని తెచ్చుకోవడంలో విజయం సాధించారు.