పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు.. గెజిట్ విడుదల, ఆయనకు అదొక్కటే ఊరట

Wait 5 sec.

బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దు అయ్యింది.. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ రాజపత్రం విడుదల చేశారు. ఆనంద్ సర్టిఫికెట్ రద్దు అంశంపై జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ సిఫార్సుతో పాటుగా ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రాల రెగ్యులేషన్‌ చట్టం 1993, సాంఘిక సంక్షేమ శాఖ జీవో నంబరు 58 ప్రకారం తన అధికారాలను ఉపయోగిస్తూ రద్దు చేసినట్లు కలెక్టర్ రాజపత్రంలో తెలిపారు. తాజా నిర్ణయంతో పాస్టర్‌ చింతాడ ఆనంద్‌కు పిట్టలవానిపాలెం తహసీల్దారు 2021 మే 15.. 2022 అక్టోబరు 22.. 2025 ఫిబ్రవరి 2న జారీ చేసిన ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలు రద్దయ్యాయని కలెక్టర్ తెలిపారు.పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ క్రైస్తవ మతం ఆచరిస్తున్నారని.. ఆయన ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలేనికి చెందిన అక్కల రామిరెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత కలెక్టర్‌ పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే పాస్టర్ ఆనంద్ 30 రోజుల్లోగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ఫేర్‌లో అప్పీల్‌ చేసుకోవచ్చని కూడా పేర్కొన్నారు. మొత్తం మీద అంశం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో పాస్టర్‌ ఆనంద్‌ తనపై అక్రమంగా ఎట్రాసిటీ కేసు పెట్టి వేధించారని అక్కల రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల్ని గత ప్రభుత్వంలో అధికార పార్టీ నేతలు ప్రోత్సహించారరని ఆరోపించారు. తాను అన్ని సమస్యల్ని తట్టుకుని నిలబడి న్యాయ పోరాటం చేశాను అన్నారు. పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయంపై హర్ష్యం వ్యక్తం చేశారు. తాను ఎస్సీగా పుట్టానని.. క్రైస్తవాన్ని విశ్వసించాను కానీ కులాన్ని మార్చుకోలేదంటున్నారు పాస్టర్ ఆనంద్. తన ఎస్సీ హోదా కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఐదేళ్ల క్రితం బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెంలో చర్చికి సంబంధించిన భూ వివాదం జరిగింది. అదే ఊరికి చెందిన అక్కల రామిరెడ్డితో పాటూ కొందరిపై. చందోలు పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. వెంటనే రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.. ఆనంద్ క్రైస్తవ మతంలోకి మారారని.. తనపై పెట్టిన ఎట్రాసిటీ కేసు చెల్లదని వాదనలు వినిపించారు. చందోలు పోలీసులు రామిరెడ్డిపై నమోదు చేసిన కేసు చెల్లదని హైకోర్టు కొట్టేసింది. పాస్టర్ ఆనంద్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా రామిరెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది.. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది.సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి 24న ఇచ్చిన తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించింది. క్రైస్తవ మతం ఆచరించే వారికి ఎస్సీ హోదా వర్తించదని తేల్చి చెప్పింది. ఆ వెంటనే రామిరెడ్డి పాస్టర్ ఆనంద్ ఎస్సీ పర్టిఫికెట్ (కుల ధ్రువీకరణ పత్రం) రద్దు చేయాలని బాపట్ల జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వినోద్‌కుమార్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు అంశంపై జిల్లాస్థాయి స్క్రూటినీ కమిటీని వేశారు.. ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ఈ స్క్రూటినీ కమిటీ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని నివేదికను అందజేసింది. బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 19న తుది విచారణ జరిగింది.. పాస్టర్ ఆనంద్ విచారణకు హాజరై కొన్ని డాక్యుమెంట్లను సమర్పించి.. తన ఎస్సీ సర్టిఫికెట్‌ను కొనసాగించాలని కోరారు. అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న కలెక్టర్ న్యాయ నిపుణుల సలహా తర్వాత పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు.