తెలంగాణకు రూ.9,968 కోట్లు.. గ్రామ పంచాయతీలకు నిధుల పండగ

Wait 5 sec.

తెలంగాణలోని కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులను కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి గాను రాష్ట్రానికి రూ.9,968 కోట్లను నిర్దేశించింది. ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిధులను కేవలం గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్‌లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, స్ట్రీట్‌ లైట్‌ల ఏర్పాటు వంటి ప్రజా సేవల కోసమే వినియోగించాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈ గ్రాంట్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం ఉపయోగించరాదని ఖచ్చితమైన నిబంధన విధించింది.నిధుల దుర్వినియోగానికి తావులేకుండా ఉండేందుకు కేంద్రం కఠినమైన పర్యవేక్షణ నిబంధనలను తెచ్చింది. ప్రతి స్థానిక సంస్థ ఎప్పటికప్పుడు తమ వ్యయ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని, వాటి ఆధారంగా సమగ్ర నివేదికలను రాష్ట్రం కేంద్రానికి సమర్పించాలని ఆదేశించింది. ఆడిట్‌లో ఏవైనా లోపాలు గుర్తిస్తే తక్షణమే సరిదిద్దాలని, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని దీనిపై తగిన పరిపాలన ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఐదేళ్ల కాలానికి ఆర్థిక సంఘం దేశం మొత్తానికి రూ.4,35,236 కోట్లను గ్రాంట్లుగా ప్రకటించింది. ఇందులో 80 శాతం నిధులు నేరుగా పంచాయతీలకు, 10 శాతం మండల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిషత్‌లకు దక్కుతాయి. ఈ నిధులను ఏటా జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతల్లో విడుదల చేస్తారు. అయితే మొత్తం నిధుల్లో 20 శాతం నిధుల విడుదలను పనితీరు ఆధారంగా కేంద్రం నిర్ణయిస్తుంది. రాష్ట్రాలు స్థానిక సంస్థలకు ఏ మేరకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాయనే అంశంపై రాష్ట్ర పనితీరును, పన్నుల వసూళ్లు, సొంత ఆదాయ వనరుల పెంపుదల ఆధారంగా పంచాయతీల పనితీరును పరిగణనలోకి తీసుకుంటారు. 2026 నాటి అంచనాల ప్రకారం గ్రామీణ జనాభాకు 90 శాతం, రాష్ట్ర వైశాల్యానికి 10 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఈ లెక్కన తెలంగాణ గ్రామీణ జనాభాకు 1.92 శాతం, వైశాల్యానికి 0.37 శాతం చొప్పున మొత్తం రూ.9,968 కోట్ల నిధులు దక్కాయి.మొదటి విడత నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ వివరాలతో పాటు, 2025-26 ఆర్థిక సంవత్సరం నాటి స్థానిక సంస్థల ఆడిట్‌ నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. మొదటి విడత నిధుల వినియోగ ధ్రువీకరణ, పురోగతి ఆధారంగానే రెండో విడత నిధులు విడుదలవుతాయి. కేంద్రం నుంచి గ్రాంట్లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు చేరుతాయి. అక్కడి నుంచి కేవలం పది పనిదినాల్లోగా సంబంధిత గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాలి. రాజ్యాంగంలోని 9వ భాగం ప్రకారం సక్రమంగా ఎన్నికలు జరిగి, ప్రజాప్రతినిధులు ఉన్న స్థానిక సంస్థలకే ఈ నిధులు విడుదలవుతాయి. నిర్దేశిత అవసరాలకు కేటాయించిన నిధులను వాటికే వెచ్చించాలి. అన్‌టైడ్‌ నిధులలో 20 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం ఖర్చు చేయరాదు. నిధుల వినియోగంపై తప్పనిసరిగా గ్రామ సభలో, మండల, జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశాల్లో తీర్మానాలు చేయాలి. ఆ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వ ఇ-గ్రామ్‌స్వరాజ్‌ పోర్టల్‌లో విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది.