వాంఖడేలో తడబడి నిలబడిన రాజస్థాన్.. ముంబై ఇండియన్స్‌కు భారీ టార్గెట్

Wait 5 sec.

ప్లే ఆఫ్స్‌లో అర్హత సాధించేందుకు డూ ఆర్ డై మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలో తడబడినా ఆఖర్లో నిలబడింది. రాజస్థాన్ రాయల్స్‌కు బలమైన ఆ జట్టు ఓపెనర్లు ఈ కీలక మ్యాచ్‌లో విఫలమయ్యారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని సింగిల్ డిజిట్‌కే ముంబై ఇండియన్స్ ప్లాన్ చేసి మరీ పెవిలియన్‌కు పంపింది. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌తో పాటు రవీంద్ర జడేజా కూడా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 205/8 పరుగులు చేసింది.వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే తడబడింది. ప్రతి మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించే వైభవ్ సూర్యవంశీ ఆరు బంతులు క్రీజులో ఉన్నప్పటికీ కనీసం ఒక్క బౌండరీ కూడా నమోదు చేయలేదు. మంచి ఫామ్‌లో ఉన్నాడు అనుకున్న యశస్వి జైస్వాల్‌ను విల్ జాక్స్ పెవిలియన్‌కు పంపాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే ఓపెనర్లు ఇద్దర్నీ కోల్పోయింది. కెప్టెన్ రియాన్ పరాగ్ పవర్ ప్లే ఆఖరి ఓవర్‌లో బౌండరీలు బాదుతూ ఆఖరి బంతికి పెవిలియన్ బాట పట్టాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 17 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 27 పరుగులు చేయగా.. వైభవ్ సూర్యవంశీ ఆరు బంతుల్లో నాలుగు, రియాన్ పరాగ్ 8 బంతుల్లో 14 పరుగులు చేసి అవుటయ్యారు. దాంతో రాజస్థాన్ 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ధృవ్ జురేల్, దాసున్ శనక కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. శనక 15 బంతుల్లో మూడు సిక్సర్లతో 29 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు అనుకున్న సమయంలో అనవసరంగా రనౌట్ అయ్యాడు. ధృవ్ జురేల్ 26 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగులు చేసి కార్బిన్ బాష్ యార్కర్‌కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 13 ఓవర్లలో 119/5 పరుగులు చేసింది. 15 బంతుల్లో 18 పరుగులు చేసిన డొనోవాన్ ఫెరీరా కూడా 16వ ఓవర్‌లో పెవిలియన్ బాట పట్టాడు. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ విఫలమవడంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేయలేదని అందరూ అనుకున్నారు. కానీ.. జోఫ్రా ఆర్చర్ ముంబై బౌలర్లకు షాక్ ఇస్తూ వీరంగం సృష్టించాడు. తన హ్యాండ్ పవర్ ఏంటో ఈ మ్యాచ్‌లో చూయించాడు. చిక్కిన బంతిని చిక్కినట్టు బౌండరీ బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 15 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 32 పరుగులు చేసి 18వ ఓవర్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 19, బర్గర్ 10 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.