ఘోర విషాదం.. ఆల్చిప్పల కోసం నదిలోకి దిగి 8 మంది మృతి

Wait 5 sec.

కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆల్చిప్పల కోసం నదిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కన్నడలోని తాలూకా తట్టేహక్కలు అనే నదిలో ఈ విషాదం చోటుచేసుకుంది. చనిపోయిన 8 మందిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి ఈ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలూ పొంగిపొర్లాయి. ఈ సమయంలో ఆల్చిప్పలు విరివిగా దొరికే అవకాశం ఉండటంతో సిరాలి అనే ఊరికి చెందిన ఓ కుటుంబం ఆదివారం ఉదయం తట్టేహక్కులు నదిలోకి దిగింది. మొత్తం 14 మంది కుటుంబసభ్యులు ఆల్చిప్పల కోసం నదిలోకి దిగా.. నదీ ప్రవాహం పెరిగి, అందులోని ముగ్గురు కొట్టుకుపోయారు. వీరిని కాపాడే ప్రయత్నంలో మిగతా వారు కూడా నదిలో మునిగిపోయారు.ఈ విషయాన్ని గమనించిన స్థానిక జాలర్లు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. 14 మందిలో ముగ్గురిని కాపాడి వెలుపలికి తీసుకువచ్చారు. ఈలోగా మిగతా 11 మంది నదిలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రానికి ఎనిమిది మృతదేహాలను గుర్తించారు. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు కాగా.. ఒక పురుషుడు ఉన్నారు. మిగతా ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరికి స్థానిక జాలర్లు కూడా సహాయం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆల్చిప్పలతో ఉపయోగాలు..మరోవైపు ఆల్చిప్పలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆల్చిప్పలను ముత్యాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. తొట్టెలు, చెరువులలో పెంచుతూ ముత్యాలను ఉత్పత్తి చేశారు. ఆలాగే ఆల్చిప్పల ద్వారా ఆహార ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, జింక్ వంటి పోషకాలు ఉండటంతో సీఫుడ్ ప్రియులు ఆహారంగా స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలోనే వర్షాకాలంలో ఆల్చిప్పల కోసం నదులలో వేట కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆల్చిప్పల కోసం వెళ్లిన కుటుంబం.. తమకు ఎదురయ్యే విషాదాన్ని ఊహించలేకపోయింది. కుటుంబంలో ఒకేసారి 8 మంది చనిపోవటంతో.. మిగతావారు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.