‘చంద్రబాబు అపాయింట్‌మెంట్ దొరుకుతుంది.. కానీ పవన్ కళ్యాణ్‌ది దొరకదు’: కాపు నేత దాసరి రాము సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కాపు సంఘం నేత సంచలన కామెంట్స్ చేశారు. జనసేన కార్యకర్తలు సమస్యలు చెప్పుకుందామంటే అందుబాటులో ఉండటం లేదని ఆయన ఆరోపించారు. ఓ స్థాయి ఉన్న వారికి ఎవరికైనా రెండు మూడు రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ దొరుకుతుంది. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం జనసేన కార్యకర్తలు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీసుకు రావడం లేదని, సచివాలయంలోని మంత్రి పేషీలోనూ ఆయన అందుబాటులో ఉండటం లేదన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేశ్, తాళ్లూరు రాము, చక్రవర్తి అంతా కమ్మవారేనని.. బీసీలు, ఎస్సీలు ఎవరైనా అక్కడ ఉన్నారా? ఆఫీసు గేటు దగ్గరికి ఎవరినైనా రానిస్తారా? అని దాసరి రాము ప్రశ్నించారు.‘దాదాపు 60-70 ఏళ్లుగా రెండు కులాలే రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాయి. మిగతా కులాలకు రాజ్యాధికారం అందాలనే ఉద్దేశంతోనే తాము ప్రజారాజ్యం పార్టీ, జనసేనకు మద్దతుగా నిలిచామని.. అంతేకానీ కుల పిచ్చితో కాదు’ అని రాము తెలిపారు. ప్రజారాజ్యం పార్టీని ఎక్కువగా భుజాల మీద వేసుకుంది కాపులేనన్నారు. ప్రజారాజ్యం పార్టీతో కాపులు ఆర్థికంగా దెబ్బతిన్నారన్నారు. అందుకే జనసేన పార్టీ పెట్టిన కొత్తలో పవన్ కళ్యాణ్‌ను కాపులు అంతగా ఇష్టపడ లేదన్నారు.2019 ఎన్నికలకు ముందు ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా పని చేసిన పీవీ రావు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడటానికి తనను ఆహ్వానించారని దాసరి రాము తెలిపారు. పవన్ కళ్యాణ్ సహకరించాలని కోరిన తర్వాతే తాను ఆయనకు మద్దతుగా నిలిచానన్నారు. 2014లో టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ఐదేళ్లు ఎటు పోయారో తెలియలేదని.. 2019లో ఒంటరిగా పోటీ చేద్దామంటే.. గ్రామాల్లో ఇప్పటికే జనం రెండు వర్గాలు చీలిపోయి ఉన్నారని.. ఎన్నికలకు వెళ్తే ఓడిపోతారని పవన్ కళ్యాణ్‌కు తాను చెప్పానన్నారు. జగన్ వైపు మళ్లే కాపుల ఓట్లను చీల్చడం కోసమే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేశారని ప్రచారం జరిగిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకటేనని జగన్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిందన్నారు. 2019లో భీమవరంలో చంద్రబాబు నాయుడే ఒత్తిడి చేసి టీడీపీ నుంచి రామాంజనేయుల్ని భీమవరంలో పవన్ కళ్యాణ్‌కు ప్రత్యర్థిగా నిలబెట్టారని.. రూ.25 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. తిరిగి అదే రామాంజనేయులుకు జనసేన కండువా కప్పి బీఫామ్ ఇచ్చి పంపించాల్సి వచ్చిందన్నారు.2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి 2024 ఎన్నికల వరకు జనసేన పార్టీ కోసం తాను పని చేశానని దాసరి రాము తెలిపారు. ‘చిరంజీవి దెబ్బ వల్ల జనాలు పవన్ కళ్యాణ్‌కు అండగా నిలిచే పరిస్థితిలో లేరు. ఈ విషయం పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ కాపులు నాకు అండగా నిలబడటం లేదని అంటున్నారని.. చంద్రబాబు ఎప్పుడైనా కమ్మవాళ్ల గురించి ఇలా అన్నారా? జగన్ రెడ్ల గురించి అన్నారా? పవన్ కళ్యా‌ణ్‌కు కాపులు ఎందుకు లోకువ అవుతున్నారు. మేమేం ఆయన్ను ఒక మాట అనలేదు కదా. నేను ఏ ఊరికి వెళ్లి మన వాడికి ఓటేయాలని కోరితే.. ప్రజారాజ్యం పార్టీ అనుభవాలను గుర్తు చేశారు’ అని దాసరి రాము తెలిపారు.‘జగన్ మోహన్ రెడ్డి అనే ఒక సునామీ టీడీపీ మీద, కమ్మ సామాజికవర్గం మీద పడింది.. దానికి అడ్డంగా నిలబడింది జనసేన పేరిట కాపులే. మొన్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాం. మా పట్ల సానుకూలంగా ఉండాల్సిన కమ్మ సామాజికవర్గం, టీడీపీ వాళ్లు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ పార్టీ అధిష్టానం నుంచి కింది స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ మమ్మల్ని ఓన్ చేసుకోలేదు. 2014లో కాపులు మనకు ఓటేశారు. 2019లో వాళ్లు వైసీపీ వైపు మళ్లారు. 2024లో తిరిగి మనకు ఓటేశారు. తర్వాతి ఎన్నికల్లో ఎటు మళ్లుతారో తెలీదు. కాబట్టి కాపు కులాన్ని, జనసేన కార్యకర్తలను అణచివేయండి, వాళ్లకు ఏ పనులు చేయొద్దని ఆదేశించారు’ అని దాసరి రాము ఆరోపించారు.రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలను కొట్టడం, స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడితో కేసులు లేకుండా చేయడం చేస్తున్నారని దాసరి రాము ఆరోపించారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇలా జరుగుతుండటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను జనసేన రాష్ట్ర ఆఫీసుకు వెళ్లి చెప్పుకోవాల్సి ఉంటుందని.. కానీ పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండటం లేదన్నారు. జనసేనలోని కీలక నేతలు నాదెండ్ల మనోహర్, తాళ్లూరి రాము, లింగమనేని రమేశ్, చక్రవర్తి అందరూ కమ్మ వాళ్లేనన్నారు. జనసేన కార్యకర్తలది అరణ్య రోదనగా మారిందన్నారు.వైసీపీ హయాంలో టీడీపీ నాయకులపై నమోదైన కేసులన్నీ మాఫీ అయ్యాయి. మరి జనసేన కార్యకర్తలపై నమోదైన ఎన్ని కేసులను మాఫీ చేశారో పవన్ కళ్యాణ్ చెప్పాలని దాసరి రాము డిమాండ్ చేశారు. కింది స్థాయిలో కార్యకర్తలు పడే బాధలు, అవమానాలు ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఆత్మాభిమానంతో బతికామని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే కూర్చోండి, కాఫీ తాగండి అని కూడా అడగటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.