ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం వచ్చేసింది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియను సులభతరం చేసుకునేందుకు వీలుగా ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ఐటీఆర్ ఫారాలను నోటిఫై చేసింది. అయితే, ఒక వేళ మీరు మీ ఆదాయ వనరులకు సరిపోలని, ఎంచుకుని సబ్మిట్ చేస్తే ఏం జరుగుతుంది? ఆదాయపు పన్ను శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదాయపు పన్ను శాఖ ప్రతి కేటగిరీ పన్ను చెల్లింపుదారుల కోసం (ఉద్యోగులు, వ్యాపారస్తులు, మూలధన లాభాలు లేదా విదేశీ ఆస్తులు ఉన్నవారు) విడివిడిగా ఐటీఆర్ ఫారాలను రూపొందించింది. ఒక వేళ మీరు పొరపాటున తప్పు ఫారం ఎంచుకుంటే అది మీ రిటర్నుల ప్రాసెసింగ్‌ను నిలిపివేయడమే కాకుండా మరికొన్ని ఇబ్బందులకు దారి తీయవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా దానిని పరిశీలిస్తుంది. ఫారంలో టెక్నికల్ లోపాలు ఉన్నా లేదా ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రికార్డులతో సమాచారం సరిపోలకపోయినా దానిని డిఫెక్టివ్ రిటర్న్ గా పరిగణిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 (9) కింద మీకు నోటీసు పంపిస్తారు. నోటీసు వచ్చిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ట్యాక్స్ పేయర్లకు సాధారమంగా 15 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. నిర్ణీత 15 రోజుల గడువులోగా సదరు లోపాన్ని సరిచేయకపోతే, మీరు అసలు ఐటీఆర్ దాఖలు చేయనట్లుగానే పరిగణిస్తారు. తప్పులు సరిదిద్దే వరకు మీ రిటర్న్ ప్రాసెస్ అవ్వదు. దీనివల్ల మీకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్లు నిలిచిపోతాయి. ఒక వేళ ఆదాయాన్ని తక్కువగా చూపినట్లు గుర్తిస్తే భవిష్యత్తులో స్కూటీని నోటీసులు, ఆదనపు పన్ను, వడ్డీ, జరిమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎలా సరిదిద్దుకోవాలి?ఇందుకోసం రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్మెంట్ ఇయర్ ముగిసే వరకు ఆన్‌లైన్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లోకి వెళ్లి, మునుపటి రిటర్నును రివైజ్ చేసే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ సరైన ఐటీఆర్ ఫారంను ఎంపిక చేసుకుని, సరైన వివరాలతో మళ్లీ సబ్మిట్ చేయాలి. ఒక వేళ ఈ గడువు కూడా ముగిసిపోతే, అదనపు పన్ను, వడ్డీని చెల్లించి అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఐటీ శాఖ నుంచి నోటీసులు రాకముందే ఈ తప్పును వీలైనంత త్వరగా సరిచేసుకోవడం మంచిది.