తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లిస్తానని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిల చెల్లింపునకు రూ.2 వేల కోట్లను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను కేవలం 100 రోజుల్లోనే రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఉద్యోగ జేఏసీ నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా.. శుక్రవారం రోజున తొలి విడతగా రూ.2 వేల కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా విడుదల చేసిన నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలక బకాయిలు మొత్తం ప్రభుత్వం పూర్తిగా చెల్లించినట్లు అయింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) బకాయిలను మొత్తంగా 100 శాతం క్లియర్ చేశారు. అదే సమయంలో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 2025 మే వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలను అన్నింటినీ పూర్తిగా చెల్లించారు. ముందస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైందని అధికారులు వెల్లడించారు. ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ. 4 వేల కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా వారి అకౌంట్లలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.