: కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయడం.. తర్వాత కొత్త సిరీస్‌లో రూ. 500 సహా ఇతర నోట్లు తీసుకురావడం.. తర్వాత మళ్లీ 2023లో రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకోవడం జరిగింది. ఇప్పుడు రూ. 500 పెద్ద నోటుగా ఉంది. దీనికే ఆదరణ కూడా పెరిగిందని చెప్పొచ్చు. కిందటి ఆర్థిక సంవత్సరంలో (2025-26) బ్యాంకింగ్ వ్యవస్థలో చలామణిలో ఉన్నటువంటి ఈ నోట్ల సంఖ్య 11.2 శాతం మేర పెరిగింది. ఇంకా.. ఇదే సమయంలో నకిలీ నోట్లు కూడా ఎక్కువవుతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు కరెన్సీ నోట్ల గురించి ఆర్బీఐ తన వార్షిక నివేదికలో కీలక వివరాల్ని వెల్లడించింది.>> 2026 ఆర్థిక సంవత్సరం ముగిసిన మార్చి 31 నాటికి 7,05,482 లక్షల మేర రూ. 500 నోట్లు చలామణిలో ఉండగా.. అంతకుముందు ఇదే సమయంలో వీటి సంఖ్య 6,34,458 లక్షల నోట్లు ఉన్నాయి. విలువ పరంగా చూస్తే ఏడాది వ్యవధిలో రూ. 31.72 లక్షల కోట్ల నుంచి రూ. 35.27 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. ఇక ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో అధిక వాటా రూ. 500 నోటుదే ఉంది. సంఖ్యా పరంగా చూసినా దీని వాటానే 41.2 శాతంగా ఉంది. ఇంకా విలువ పరంగా మెజార్టీ భాగం ఏకంగా 86 శాతం వాటా 500 రూపాయల నోటుదే కావడం విశేషం. సంఖ్యా పరంగా రూ. 10 నోటు 16.1 శాతం ఉండగా.. దీనిదే రెండో స్థానం. చలామణిలో ఉన్న రూ. 10 నోట్లలో మొత్తం ఈ నోట్ల విలువ 11.9 శాతం, సంఖ్యా పరంగా 10.5 శాతం పెరిగింది. దీనిని బట్టి ఆర్థిక వ్యవస్థలో క్యాష్ డిమాండ్ ఇంకా బాగానే కొనసాగుతుందనడానికి ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. 500 నకిలీ నోట్లు పెద్ద సంఖ్యలో చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ గుర్తించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే.. ఈ నోట్ల నకిలీ 20 శాతం మేర పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నకిలీ రూ. 500 నోట్ల సంఖ్య 1,17,222 గా గుర్తించగా.. 2025-26లో చూస్తే ఇది 1,41,907 కి పెరిగింది. ఇది దాదాపు 20 శాతం ఎక్కువగా ఉంది. అన్ని నోట్ల పరంగా చూస్తే నకిలీ నోట్ల బెడద 5.7 శాతం మేర పెరిగిందని ఆర్బీఐ పేర్కొంది. నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి?రూ. 500 ఫేక్ కరెన్సీ నోటును గుర్తించి.. నకిలీ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. ఇందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు జనాన్ని అప్రమత్తం చేస్తోంది. దీని గురించి వివరించింది. .. అక్కడ అన్ని డినామినేషన్ కరెన్సీ నోట్లు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేయడం ద్వారా.. అక్కడ కరెన్సీ నోటు ఫీచర్స్ తెలుసుకోవచ్చు. అన్నీ మార్క్ చేసి వివరించింది. జాగ్రత్తగా నోటును గమనించడం ద్వారా ఏది నకిలీదో.. ఏది అసలుదో కనిపెట్టొచ్చు.కరెన్సీ నోటులో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. ఇది నిలువు గీత రూపంలో ఉంటుంది. ముందు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. నోటు వంచి చూస్తే అది ముదురు నీలం రంగులోకి మారిపోతుంది. గీత రంగు మారకుంటే ఫేక్ అని గుర్తించాలి. కుడి, ఎడమవైపు ఖాళీ ప్లేసులో జాతిపిత మహాత్మా గాంధీ ఫొటో కనిపిస్తుంది. కాస్త వెలుతురులో స్పష్టంగా కనిపిస్తుంది. అంకెల్లో నోటు విలువ కూడా గమనించొచ్చు. కరెన్సీ నోటును సాధారణ పేపర్‌తో తయారు చేయరు. కాబట్టి ఇది కాస్త తడిచినా.. మామూలు పేపర్‌లా చిరిగిపోదు. దీనిని బట్టి ఫేక్, రియల్ ఏదనేది తెలుసుకోవచ్చు. నోటు వెనుక స్వచ్ఛ భారత్ లోగో సహా స్లోగన్, లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది. ఇంకా రెడ్ ఫోర్ట్ కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే.