ఏపీలో రైతులకు హెచ్చరిక.. 60 రోజుల పాటూ ఈ మందుపై నిషేధం, ఎవరూ వాడొద్దు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ముఖ్యమైన గమనిక.. గడ్డి మందుపై నిషేధం విధించింది. రైతులు పంటలతో పాటుగా చెరువులు, కాల్వల్లో కలుపు నివారణ కోసం ఉపయోగిస్తున్న పారాక్వాట్‌ డీక్లోరైడ్‌ 24% ఎస్‌ఎల్‌ను నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మందు ఉత్పత్తి, అమ్మకాలు, నిల్వలు, పంపిణీపై 60 రోజుల పాటూ తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని.. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా తయారైన ఈ మందును అన్ని రూపాల్లో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఏపీలో ఈ గడ్డి నివారణ మందు తయారీదారులు, పంపిణీదారులు, డీలర్లు, రీటైలర్లు, వినియోగదారులంతా వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ గడ్డి నివారణ మందు విషయంలో వ్యవసాయశాఖ కమిషనర్, జిల్లాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారాక్వాట్‌ డీక్లోరైడ్‌ మందు చాలా ప్రమాదకరంగా మారింది.. ఈ మందు వినియోగం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ గడ్డి నివారణ మందు తక్కువ పరిమాణంలో శరీరంలోకి చేరినా ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఎలాంటి విరుగుడు లేదని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఈ మందును నివారించాలని వైద్యఆరోగ్యశాఖ నివేదిక ఇచ్చింది. అలాగే పారాక్వాట్‌ డీక్లోరైడ్‌ మందు తాగిన వారు కొద్దిసేపటికి చనిపోతున్నారు. అందుకే ఈ మందు నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం కూడా ఈ పారాక్వాట్‌ డీక్లోరైడ్‌ మందు దుష్ప్రభావాల్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మందు కారణంగా కిడ్నీలు దెబ్బతినడంతోపాటు ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. మెదడులోని నాడీ వ్యవస్థను దెబ్బతీసే పార్కిన్సన్స్‌ వ్యాధికి కారణమవుతున్నట్లు తేలింది. దీంతో ఏపీలో కూడా ఈ మందును నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది మార్చిలో ఈ గడ్డి మందును 60 రోజుల పాటు నిషేధించింది. తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరింది.. అయితే ఒడిశాలో కూడా ఈ మందుపై చర్యలు తీసుకున్నారు.