తెలంగాణ రాష్ట్రాన్ని భానుడి భగభగలు అల్లాడిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, గురిచేశాయి. శుక్రవారం రాష్ట్రంలోని మొత్తం 244 మండలాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. పగటిపూట ఇళ్ల నుంచి బయటకు రావడానికే జనం జంకుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి)లో 46.5 డిగ్రీల సెల్సియస్‌ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. దీనితో పాటు జగిత్యాల జిల్లా ధర్మపురి, కరీంనగర్ జిల్లా గంగాధర, మంచిర్యాల జిల్లా కాజీపేట, నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, సూర్యాపేట జిల్లా మోతేలలో గరిష్ఠంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే హన్మకొండ జిల్లా కమలాపూర్, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, ఖమ్మం, ములుగు జిల్లా ఏటూరునాగారం, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లలో 46.3 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, సిద్దిపేట జిల్లా కోహెడ, వరంగల్ జిల్లా పర్వతగిరిలలో 46.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మొత్తం 16 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46.2 నుంచి 46.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సాధారణంగా వేసవిలో పగటిపూట ఎండలు దంచి కొట్టినా, సూర్యాస్తమయం తర్వాత చల్లటి గాలులు వీస్తుంటాయి. కానీ.. ప్రస్తుత వాతావరణంలో గాలిలో తేమ శాతం కనిష్ఠానికి పడిపోవడంతో రాత్రి వేళల్లో కూడా వేడి సెగలు తగ్గడం లేదు. గురువారం రాత్రి హకీంపేటలో సాధారణం కంటే 4.7 డిగ్రీలు పెరిగి 29.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆదిలాబాద్‌లో 3.7, నిజామాబాద్‌లో 3.6, హనుమకొండలో 3, హైదరాబాద్‌లో 2.7 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం విశేషం. రాత్రిపూట కూడా జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.శుక్రవారం ఒక్క సూర్యాపేట జిల్లాలోనే అత్యధికంగా 22 మండలాల్లో వడగాలులు వీచాయి. మంచిర్యాల, ఖమ్మం, నిజామాబాద్‌లలో 18 చొప్పున, జగిత్యాలలో 17, నిర్మల్‌లో 15 మండలాల్లో తీవ్ర ప్రభావం కనిపించింది. వచ్చే నాలుగు రోజుల పాటు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD), విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలోని 18 జిల్లాలకు వాతావరణ శాఖ అత్యంత ప్రమాదకరమైన రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ సహా పలు జిల్లాల ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఈనెల 24న 7 జిల్లాలు, 25న 10 జిల్లాలు, 26న 4 జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తలు అవసరమని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.