రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, వితంతువులు, మహిళలు, చిన్న పిల్లలు, యువకులకు ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయానికి తెరతీసింది. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను అన్నింటినీ ఒకే కార్డులో నిక్షిప్తం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి.. అన్ని శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా.. ఏ పథకం కింద.. ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ ద్వారా స్పష్టంగా తెలియజేసేలా దాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. అందుకు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని.. అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. తాజాగా నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరై.. ప్రత్యేకంగా చర్చించారు.ఈ సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధానం అనుసరించడం వల్ల నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరుతాయని.. అదే సమయంలో అనర్హులను గుర్తించడం కూడా చాలా ఈజీ అవుతుందని అభిప్రాయపడ్డారు.ప్రతీ శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు.. ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు. ఈ సమగ్ర సంక్షేమ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, బీమా పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌‌ను కూడా ఇచ్చేలా ఆలోచన చేయాలని సూచించారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ సమగ్ర సంక్షేమ కార్డుకు అనుసంధానం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు.ఈ సమగ్ర సంక్షేమ కార్డుకు ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే.. వెంటనే ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని.. దాని ఆధారంగా వెంటనే చర్యలు మొదలయ్యేలా ఉండాలని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో లింక్ చేయాలని వెల్లడించారు. కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే.. అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు కచ్చితంగా చేరేలా.. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.