ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా మారుస్తామని ఏపీ డిప్యూటీ సీఎం అన్నారు. , కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్రక్రియను పరిశీలించి, వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు.. దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు.? దేనికి ఉపయోగిస్తారనే విషయాలను అధికారులు వివరించారు. ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్తు తయారీ ఎలా జరుగుతుందో, చివరికి బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించుకోవచ్చో అధికారులు పవన్ కళ్యాణ్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ప్లాంటు మొత్తం తిరిగిన పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో రోజువారీగా 7,200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతోందని అన్నారు. కొండవీడు జిందాల్ ప్లాంటు రోజూ1,400 టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేసి, సగటున 20 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని వివరించారు. దీనిని రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌తో అనుసంధానం చేసి, రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చగలదని వివరించారు. విశాఖలోనూ జిందాల్ ప్లాంటు ఉత్తరాంధ్ర రీజియన్ చెత్తను సేకరించి 15 మెగావాట్లు విద్యుత్తు ఉత్పాదన చేస్తోందన్న పవన్ కళ్యాణ్.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహాలో మరో 6 ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాకినాడలో ఇప్పటికే పనులు మొదలు అయ్యాయని., నెల్లూరు, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో కూడా త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు.ఇక గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నదిలో కలుస్తున్న వ్యర్థాలను పూర్తిస్థాయిలో అరికట్టేలా చిత్తశుద్ధితో ప్రణాళికను అమలు చేస్తా్మన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి 268 పంచాయతీలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతాయని.. నదిలోకి వ్యర్థాలను విడుదల చేయకుండా, నదిని అందంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దడం మీద ఈ పంచాయతీల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. సింగపూర్ ప్రజలు ఉపయోగించే కరెంటులో 2.8 శాతం చెత్త నుంచి ఉత్తత్పి అయ్యేదే ఉంటుందని.. సింగపూర్ టాంజాంగ్ టెర్మినల్లో చెత్తను వేరు చేసే ప్రక్రియ చాలా పద్ధతిగా జరుగుతుందన్నారు పవన్ కళ్యాణ్. అలాంటిది విశాఖపట్నం పోర్టులో కూడా మొదలుపెట్టేలా ఆలోచిస్తామని తెలిపారు.రాష్ట్రాన్ని డంపింగ్ యార్డు రహితంగా తీర్చిదిద్దాలంటే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు మరిన్ని అవసరమని.. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించారు. పంచాయతీల్లో చెత్త నిర్వహణకు సంబంధించి క్లస్టర్ల వారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్లాంట్లకు చెత్త ఎలా అవసరం అవుతుంది.? దాన్ని ఎలా వేరు చేయాలి..? సేకరించిన చెత్త ద్వారా పంచాయతీలు ఆదాయం ఎలా పొందవచ్చనే అంశాలపై వర్క్ షాప్ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.