"నన్ను సవాల్ చేసే స్థాయా నీది.? ముందు జెడ్పీటీసీగా పోటీ చెయ్".. పీవీ సునీల్‌ కుమార్ ఛాలెంజ్‌పై రఘురామ

Wait 5 sec.

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సీనియర్ ఐపీఎస్ అధికారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రాజకీయాల్లో పోటీ గురించి ఇద్దరూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. తన పదవికి రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని, తాను స్వతంత్ర అభ్యర్థిగా తనపై పోటీ చేస్తానని, రఘురామ కంటే వేయి ఓట్లు ఎక్కువ తెచ్చుకోకపోతే రాజకీయాల గురించి మాట్లాడనని పీవీ సునీల్ కుమార్ ఛాలెంజ్ చేశారు. ఈ సవాల్‌పై వ్యంగ్యంగా స్పందించిన రఘురామ.. తనను ఛాలెంజ్ చేసే స్థాయి సునీల్ కుమార్‌ది కాదన్నారు. "పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్‌లో ఉన్నారు. సస్పెన్షన్‌లోనే రిటైర్ కానున్నారు. ఆయనిప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. అయితే ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి ఉన్నట్లుగా నాకు సవాల్ విసురుతున్నారు. నేను రాజీనామా చేస్తే నాపై పోటీ చేసి, వేయి ఓట్ల మెజారిటీతో ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారట. ఆయన కనీసం సర్పంచ్ కూడా కాదు. రాజకీయాల్లో నుంచి తప్పుకోవటం ఏమిటి.. ఆ ఛాలెంజ్‌లు ఏమిటి.. నవ్వుతారు ఎవరైనా.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. జెడ్పీటీసీగా ఎక్కడైనా నిలబడు. గెలవక్కర్లేదు, కనీసం సరిపడా ఓట్లు తెచ్చుకోగలిగినా.. ఏదో ఒకటి మాట్లాడటానికి కనీస అర్హత ఉంటుంది. ఏమీ లేకుండా స్థాయి మర్చిపోయి, పంచాయతీ సర్పంచ్ స్థాయి కూడా లేని వ్యక్తి.. గతంలో ఎంపీగా గెలిచి, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నన్ను ఛాలెంజ్ చేయటమా? ఇలాంటివి చాలు. జెడ్పీటీసీగా పోటీ చేసుకోండి, ఆ తర్వాత చూద్దాం." అంటూ రఘురామకృష్ణరాజు సవాల్ చేశారు. సునీల్ కుమార్ ఏమన్నారంటే?"జడ శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్ పోటీ చేస్తే వందల్లో ఓట్లు వచ్చాయి. సునీల్ కుమార్ పోటీ చేస్తే 500 ఓట్లు వస్తాయా అని రఘురామ కామెంట్ చేశారు. మీరన్నది నిజమనుకుంటే.. మీ మాట మీద మీకంత నమ్మకం ఉంటే, మీరు రాజీనామా చేయండి. వైసీపీ సహా ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయండి. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా. మీకన్నా వేయి ఓట్లు ఎక్కువగా తెచ్చుకోలేకపోతే, నేను మళ్లీ రాజకీయాల గురించి మాట్లాడను. మీరు ఓడిపోతే మళ్లీ రాజకీయాలు మాట్లాడకుండా ఉంటారా. మీ సిద్ధాంతాలను నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశం." "శ్రీకాకుళం జిల్లాలో నాపేరు చెప్పి ఒకాయన ఓపెన్ సీట్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నా ఫోటోతో తిరిగి ఒకాయన 5 వేలు ఓట్లు తెచ్చుకున్నాడు. ఇవన్నీ మీకు తెలియవేమో.. మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే రాజీనామా చేయండి" అని పీవీ సునీల్ కుమార్ ఛాలెంజ్ చేశారు. ఈ వ్యాఖ్యలకే కౌంటర్ ఇచ్చిన రఘురామకృష్ణరాజు.. కనీసం సర్పంచ్ స్థాయి కూడా లేని వ్యక్తి ఛాలెంజ్‌ విసరడమా అంటూ సెటైర్లు వేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి.. కొన్ని ఓట్లు తెచ్చుకోవాలని.. అప్పుడు ఛాలెంజ్ గురించి ఆలోచిద్దామంటూ పీవీ సునీల్ కుమార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు రఘురామ.