‘ఒసేయ్ రాముల‌మ్మ’తో ప్ర‌తీ హీరోకి భ‌యం పుట్టించారు.. థియేట‌ర్ల స‌మ‌స్య‌కు దాస‌రి ఎప్పుడో దారి చూపించారు: మంచు మనోజ్

Wait 5 sec.

లెజండరీ డైరెక్టర్, దర్శక రత్న దుస్థితి చూసి హీరో చలించిపోయిన విషయం తెలిసిందే. దాస‌రి ఘాట్ పై ఓ యాంక‌ర్ వీడియో షేర్ చేయగా.. మ‌నోజ్ దానిపై రియాక్ట్ అవ్వడమే కాకుండా, స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, తన టీమ్‌తో కలిసి శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఈ క్రమంలో దాసరి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను మ‌నోజ్, త‌న స‌తీమ‌ణి భూమా మౌనిక‌తో క‌లిసి సంద‌ర్శించారు. దాసరి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి దాసరి ఎప్పుడో దారి చూపారని మనోజ్‌ ఈ సందర్భంగా అన్నారు. ''ఈరోజు మా గురువుగారు దాస‌రి నారాయ‌ణ‌రావు వర్ధంతి. వాస్తవానికి ఆయ‌న వ‌ర్ధంతి అనే విష‌యం నాకు గుర్తు లేదు. నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాల‌నీ వైపు వ‌స్తుంటే, గురువుగారి విగ్ర‌హం చూసి ఫ్యామిలీని గుర్తు చేసుకున్నాను. వెంట‌నే దాసరి అరుణ్ కుమార్ అన్న‌కు ఫోన్ చేసి, ఆలం అక్క ఫోన్ నెంబ‌ర్ తీసుకొని వారితో మాట్లాడాను. ఎందుక‌నో దాస‌రి గుర్తుకు వ‌స్తున్నార‌ని అన్నాను. ఈలోగా వేరే ప‌నిలో ప‌డి విష‌యం మర్చిపోయాను. అది జ‌రిగి నాలుగు రోజులు కూడా కాక‌ముందే, దాసరి ఘాట్‌కు సంబంధించిన వీడియో చూడ‌గానే నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది. వెంట‌నే రెస్పాండ్ అయ్యాను. నా టీమ్‌కు నేను లేట్ గా చెప్పినా కూడా, వాళ్లు కార్మిక సిబ్బందిని తీసుకొచ్చి శుభ్రం చేయించారు. నేను కాల్ చేసిన వెంటనే ఎమ్మెల్యేగారు కూడా స్పందించి, అన్ని ఏర్పాట్లు చేశారు. నా మాట మీద ఇక్క‌డ‌కు వ‌చ్చిన వారంద‌రికీ థాంక్స్‌'' అని మంచు మనోజ్ అన్నారు.''దాసరి గురించి చెప్పాలంటే, ఆయన గొప్ప డైరెక్ట‌ర్‌.. గొప్ప యాక్ట‌ర్‌.. గొప్ప స్క్రీన్ ప్లే రైట‌ర్‌.. డైలాగ్స్‌, ఎడిటింగ్, మ్యూజిక్.. ఇలా 24 క్రాఫ్ట్స్ లో ఆయ‌న రాణించారు. ఆయ‌న నా కుటుంబ సభ్యులు.. నాకు గురువు. తండ్రి స‌మానులు. ఆయ‌న్ని, ప‌ద్మ అంటీని నేను ఎప్పుడూ మిస్ అవుతుంటాను. వాళ్లు మా కుటుంబానికి పెద్దలు. వాళ్లు లేని లోటు మాకు బాగా తెలుస్తుంది. నాకు ఇంకా బాగా తెలుస్తోంది. దాసరి డైరెక్ష‌న్‌లో చిన్నప్పుడు నేను 'నా మొగుడు నాకే సొంతం' సినిమాలో యాక్ట్ చేశాను. అలాగే 'పుణ్య‌భూమి నాదేశం' సినిమాలో ఆయ‌న‌తో క‌లిసి న‌టించే భాగ్యం ద‌క్కింది. మ్యూజిక్‌, ఎడిటింగ్ వ‌ర్క్స్ జ‌రిగేట‌ప్పుడు ఆయ‌న‌తో పాటు వెళ్లేవాడిని. నాకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద ఇంత పిచ్చి, ఇంట్రెస్ట్, ప్రాణం ఉందంటే మా నాన్న‌తో పాటు దాసరి కారణం''''దాసరి ఓ ఇన్‌స్టిట్యూట్‌. ఈరోజున ఇండస్ట్రీలో ఉన్నవారంతా ఆయన ఇన్‌స్టిట్యూషన్ చూడాలి. ఆయ‌న మ‌న‌కు ఎప్పుడో ఓ దారి చూపించారు. ఆయ‌న సామాజిక సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీశారు. దాస‌రి ప‌ని అయిపోయింద‌ని అనుకునే ప్రతీసారి, ఓ కొత్త ర‌క‌మైన సినిమాతో మ‌న ముందుకు వ‌చ్చేవారు. క‌మ‌ర్షియ‌ల్ మాస్ హీరోలు, మేల్ డామినేష‌న్ ఉన్న రోజుల్లో.. విజ‌య‌శాంతితో 'ఒసేయ్ రాముల‌మ్మ' అనే సినిమా తీసి.. ఆరోజుల్లో ప్ర‌తీ హీరోకి భ‌యం పుట్టించారు. ఆమెను క‌మ‌ర్షియ‌ల్ హీరో రేంజ్‌కు సమానంగా తీసుకొచ్చారు. ఇది మామూలు విషయం కాదు. ఆయ‌న ఇచ్చిన సోషల్ మెసేజ్, డ్రామా.. ఇలా ప్ర‌తీ ఒక్క‌టి డిఫ‌రెంట్‌'' ''ఈరోజు మన ఇండస్ట్రీలో థియేట‌ర్ల స‌మ‌స్య‌లంటూ మనలో మాట్లాడుకుంటున్నాం.. ఇబ్బంది ప‌డుతున్నాం. కానీ నాకు తెలిసి దాస‌రి నారాయ‌ణ‌రావు ఎప్పుడో దీనికి మార్గం చూపించారు. ఆయ‌న మూవీ మిష‌న్‌. ఒక సంవ‌త్స‌రానికి 10 - 12 సినిమాలు తీసేవారు. 'మనం ఒక సినిమా చేస్తే ఎంత మందికి ఎలా ఉపాధి క‌లుగుతుంది.. థియేట‌ర్స్‌ ఫిల్ అవుతాయి. థియేటర్లకు రెగ్యులారిటీ ఇవ్వ‌క‌పోతే.. జ‌నాలు రావడం తగ్గిపోతుంది. ఎప్పుడో ఓ సినిమా చేయ‌టం కాదు.. ఎప్పుడూ కంటిన్యూగా సినిమాలు చేయాల‌ని' దాసరి ఎప్పుడో పరిష్కారం చెప్పారు. నాతో పాటు నాతోటి నటీనటులందరూ ఎక్కువ సినిమాలు చేయ‌టానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. అందరం వీలైన‌న్ని ఎక్కువ సినిమాలు చేసి థియేటర్లు ఫ్లోరిస్ అయ్యేలా చూడాలి. ఆ బాధ్య‌త ఇండస్ట్రీలో అంద‌రిపై ఉంది''''ఇవాళ నా చేతుల మీదుగా ఇలా చేయడం దేవుడి ఆశీస్సులు, దాసరి దీవెనలుగా భావిస్తున్నాను. ప్రతీ ఏడాది ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ వర్ధంతి కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది తిథి ప్ర‌కారం చూస్తే, ఆయ‌న వ‌ర్ధంతి జూన్ 20న వ‌చ్చింది. తిథి కోసం వెయిట్ చేయడం వల్ల ఇలా జరిగిందే తప్ప.. దీంట్లో ఎవ‌రినీ త‌ప్పు ప‌ట్ట‌టానికి లేదు. దాసరి ఉన్నంత వ‌ర‌కు ఇండస్ట్రీలో ఏ స‌మ‌స్య ఉన్నా, ఆయన స‌మాధానంగా క‌నిపించారు. ఆయన దగ్గరకు వెళ్తే పరిష్కారం అవుతుందని భావించేవారు. దాసరి లేని లోటుని భర్తీ చేయడం కష్టమైపోయింది. అందుక‌నే దాస‌రి యుగానికి ఒక్క‌డు. దాస‌రిని చూసి మ‌నం ఎన్నో విష‌యాలు నేర్చుకోవాలి. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారు ఆయన హిస్టరీ తెలుసుకోండి. దాస‌రి, అంటీ ఇళ్లు ఎప్పుడూ మ‌నుషుల‌తో కోల‌హలం ఉండేది. దాసరి ఘాట్‌ను పార్క్‌లా కాకుండా, చుట్టు ప‌క్క‌ల పిల్ల‌లు ఆడుకునేలా ఏదైనా యాక్టివేష‌న్ చేస్తే బావుంటుంద‌ని నా కోరిక‌. అది జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నా. దాస‌రి అంకుల్, ప‌ద్మ‌ ఆంటీని ఎంతో మిస్ అవుతున్నా. ఎక్కడున్నా వారి ఆత్మ‌లు శాంతించాల‌ని కోరుకుంటున్నా'' అని మంచు మనోజ్ అన్నారు.