తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలో ఉన్న కోడి చెరువుకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వస్తున్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన ఎమ్మెల్యే స్పందించారు. పవన్ కళ్యాణ్ మీద విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక విపక్షాలు నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని అన్నారు. శంకర్‌పల్లి ప్రాంతంలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఆస్తులపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఆ ఆస్తి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి కాగా, అన్ని రకాల రిజిస్ట్రేషన్, అనుమతులు ఉన్నాయని తెలిపారు. 2015 నుంచి క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారని, ఎలాంటి ఆక్రమణలు లేదా చట్టవిరుద్ధ అంశాలు లేవని స్పష్టం చేశారు.జన్వాడ గ్రామంలోని మరో వివాదాస్పద ఆస్తికి సంబంధించిన అంశాలను పవన్ కళ్యాణ్ వ్యవసాయ భూమికి ఆపాదిస్తూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని లోకం నాగ మాధవి విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సోషల్ మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సేవ కోసం తన సినీ జీవితాన్ని త్యాగం చేసి రెండు దశాబ్దాలుగా ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడని, ఆయన నిజాయితీపై బురదజల్లే ప్రయత్నాలు ఎన్నోసార్లు విఫలమయ్యాయని లోకం నాగ మాధవి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, అక్రమాలపై పవన్ కళ్యాణ్ నిరంతరం పోరాడుతుండటంతో రాజకీయ ప్రత్యర్థులు ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని లోకం నాగ మాధవి తెలిపారు.తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణ, పెరుగుతున్న ప్రజాదరణ కూడా ఈ దుష్ప్రచారాలకు కారణమని లోకం మాధవి అభిప్రాయపడ్డారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సమసమాజ స్థాపనే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఆమె వివరించారు. నిర్మాణ కార్మికులు, రైతులు, గిరిజనులు వంటి అన్ని వర్గాల హక్కుల కోసం పవన్ కళ్యాణ్ నిరంతరం పోరాడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. చట్టబద్ధమైన ఆధారాలు, వాస్తవాలతో ఇటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని, ప్రజలు వాస్తవాలను గుర్తించి విపక్షాల కుట్రలను తిరస్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.