బీజేపీలో చేరనని KCR మీద ఒట్టేసి చెప్పాలన్న రేవంత్ రెడ్డి.. హరీష్ రావు ఎమోషనల్

Wait 5 sec.

హరీష్ రావు తప్పకుండా పార్టీ మారుతారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌ మీద ఒట్టేసి.. తాను బీజేపీలో చేరబోను అంటూ హరీష్ రావు చెప్పగలరా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో తాజాగా హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. తన పుట్టుక బీఆర్ఎస్.. నా జీవితమంతా బీఆర్ఎస్ అని ఎన్నో సార్లు చెప్పానని.. మళ్లీ అదే చెప్తున్నానని తేల్చి చెప్పారు. అసలు రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఎక్కడుందని ప్రశ్నించారు. తాజాగా సిద్దిపేట‌లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది అని నిలదీశారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డదారిలో అధికారం అనుభవించడం తప్ప చేసింది ఏముందంటూ హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 4 పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి.. తన గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. అసలు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా అని మండిపడ్డారు. తాను జీవితాంతం బీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్‌తోనే ఉంటానని ఇప్పటికే 100 సార్లు చెప్పానని.. ఇక ఇదే విషయాన్ని మరో 100 సార్లు చెబుతానని హరీష్ రావు తేల్చి చెప్పారు. తన పుట్టుక బీఆర్ఎస్‌లోనే అని.. చావు కూడా బీఆర్ఎస్‌లోనే అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పాట పాడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి.. రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదని విమర్శించారు. హరీష్ రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే క్లారిటీ లేదంటూ.. ఇటీవల రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫ్యూచర్‌లో హరీష్ రావు.. ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. 2008లో హరీష్ రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసింది నిజం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హరీష్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తనకు తెలుసని వ్యాఖ్యానించారు.