తమిళనాడులో విజయ్‌ని చూశాక.. తెలంగాణలో ధైర్యం వచ్చింది: కల్వకుంట్ల కవిత

Wait 5 sec.

తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రక్షక సేన (టీఆర్ఎస్) పార్టీ స్థాపించిన కల్వకుంట్ల కవిత.. అధికార కాంగ్రెస్‌తోపాటు.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే అధికారం అంటూ ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్థాపించిన విజయ్.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినట్లుగానే.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తొలి ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని.. తనకు మొదటి నుంచి నమ్మకం ఉందని తేల్చి చెప్పిన కవిత.. తమిళనాడులో విజయ్ గెలుపుతో ప్రజలకు కూడా నమ్మకం వచ్చిందని పేర్కొన్నారు. కొత్త పార్టీలకు అధికారం కట్టబెట్టాలని ప్రజలు భావిస్తున్నారని.. తన మనసులోని ఆమె మాట బయటపెట్టారు. గత 2, 3 ఏళ్లలో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. అడ్డంకులు దాటినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు వేలాది మంది మద్దతుదారులు తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తాను జైలులో ఉన్నప్పుడు.. బయటికి వచ్చిన తర్వాత కూడా తనను ఆదరించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని.. ఏం ఇచ్చి వారి రుణం తీర్చుకోవాలో తనకు తెలియడం లేదని కవిత పేర్కొన్నారు. ఆ విధంగా తనకు మద్దతుదారులు ఉన్నారని.. వేలాది మంది టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని వెల్లడించారు. అయితే ఒకరికి మద్దతు అనేది ఊరికే రాదని.. పార్టీ పెట్టిన 10 రోజుల్లో జెండా పండగ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో అలాంటి కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారని.. వారితోనే పార్టీ నిర్మాణం జరుగుతుందని తేల్చి చెప్పారు. తాను ఒక స్ట్రాంగ్ లీడర్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నానని.. ఎలాంటి అపజయం వచ్చినా వెనక్కి తగ్గకుండా ఎలా ఉండాలో తెలుసని స్పష్టం చేశారు. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ చూసి పెరిగిన వ్యక్తిని అని తెలిపారు. పార్టీల ఫెయిల్యూర్ అయిన తర్వాత తెలంగాణ ఉద్యమం విజయం అయిందని గుర్తు చేశారు. ఓటమి చూసి నేర్చుకుంటున్నామని.. బీఆర్ఎస్ మాదిరిగా ఓడిపోకుండా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు కవిత వివరించారు.ఇక తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు పెట్టి ఫెయిలైన నేతలు ఉన్నారని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత వివరించారు. ఇంద్రారెడ్డి, దేవేందర్ గౌడ్, చిరంజీవి వంటి నాయకులు.. పార్టీలు పెట్టినా.. వాటిని విజయవంతంగా నడపలేకపోయారని గుర్తు చేశారు. అయితే వారేమీ చిన్న నేతలు కాదని.. అలాగే వైఎస్ షర్మిల కూడా పార్టీ పెట్టారని.. కానీ ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసినట్లు చెప్పుకొచ్చారు. కొందరు ఫెయిలైన పార్టీలను చూపించి.. తమ పార్టీ కూడా అలాగే అవుతామని చెబుతున్నారని.. అయితే అది కరెక్ట్ కాదని కొట్టిపారేశారు. వందకు వెయ్యి శాతం టీఆర్ఎస్ పార్టీని సక్సెస్ చేసి చూపిస్తామని కవిత తేల్చి చెప్పారు.