'నీ ఏడుపే బీజేపీకి శాపం'.. ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. బీజేపీ చీఫ్ రియాక్షన్

Wait 5 sec.

తెలంగాణ బీజేపీలో విబేధాలు తారస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పాత నేతలు, కొత్త నేతల మధ్య గ్యాప్ ఉందంటూ వార్తలు వస్తున్న వేళ.. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేస్తూ.. ఫ్లెక్సీలు వెలియడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై ఈ ఫ్లెక్సీలు అంటించి ఉండటం గమనార్హం. ఆ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం, వార్తలు చక్కర్లు కొట్టడంతో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు రియాక్ట్ అయ్యారు. ఆ ఫ్లెక్సీల్లో ఈటల రాజేందర్‌ లక్ష్యంగా రాతలు ఉండటం గమనార్హం. 'నీ ఏడుపే బీజేపీకి శాపం' అనే హెడ్డింగ్‌తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఈటల రాజేందర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని.. కేంద్రమంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌కు 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు.. రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది బీజేపీ పార్టీనేనని గుర్తు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గెలుపొందిన తర్వాత కూడా.. తన ఇమేజ్‌తోనే గెలిచాను అని ఈటల రాజేందర్ చెప్పడం రాజకీయ నైతికత కాదని ఆ ఫ్లెక్సీల్లో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో బీసీ నాయకుడు ఎదుగుతుంటే అసహనం ఎందుకని.. ఎంపీ ధర్మపురి అరవింద్‌కు లభిస్తున్న ఆదరణను చూసి కడుపుమంట ఎందుకని అందులో ప్రశ్నించారు. తాను బీసీ నాయకుడిని.. తానే ప్రత్యామ్నాయం అనే భావన నుంచి బయటకు రావాలని ఈటల రాజేందర్‌కు సూచిస్తూ ఫ్లెక్సీల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అసలు వాటిని ఎవరు ఏర్పాటు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి వెనుక ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఈ ఫ్లెక్సీల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. తెలంగాణలో రోజురోజుకూ బీజేపీ బలం పెరుగుతోందని ఓర్వలేక ఇతర పార్టీలకు చెందిన నేతలు, బయటి వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. తమ పార్టీ నేతల మధ్య వివాదాలు రేపాలని కుట్రలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఏర్పాటు చేసిన వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. కలిసికట్టుగా ఐక్యంగా పనిచేస్తున్నారని.. అందుకే పార్టీ గ్రాఫ్ పెరిగిందని తేల్చి చెప్పారు.