ఆంధ్రప్రదేశ్‌లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఇతర జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపిస్తే వెంటనే సురక్షితమైన భవనాల్లోకి ఆశ్రయం పొందాలని సూచిస్తు్న్నారు.ఇవాళ పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భావిస్తు్న్నారు. పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్నారు. ఆదివారం పల్నాడు జిల్లా అచ్చంపేటలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం రోజు ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్,ట్ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతేకాదు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ క్రింద నిలబడరాదన్నారు.ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. అప్పటి వరకు ఎండ తీవ్రత కొనసాగుతుండగా.. ఆ తర్వాత ఉన్నట్టుండి వాతావరణం మారిపోతోంది.. పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల్ని గమనించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. . రైతులు, వ్యవసాయ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు వాతావరణాన్ని గమనిస్తూ ఉండాలన్నారు.