తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో టీటీడీ మరో పథకాన్ని ప్రారంభించింది.. శ్రీ వేంకటేశ్వర ఆపన్నహృదయ పథకం ద్వారా భక్తులకు మరో అద్భుతమైన అవకాశాన్ని కల్పి్స్తోంది. 2022లో శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు అనుబంధంగా ప్రారంభించారు. తిరుమలలోని ఆదిశేషు అతిథిగృహంలోని కార్యాలయంలో.. భక్తులు ఈ ఎస్వీ ఆప్పన్నహృదయ పథకం కింద విరాళం అందిస్తే.. ఆ మరుసటి రోజు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనానికి ముందే భఖ్తులకు వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు.తిరుమల శ్రీవారి భక్తులు శ్రీ వేంకటేశ్వర ఆపన్నహృదయ పథకం కింద రూ.లక్ష విరాళం ఇచ్చి ఐదుగురు దర్శనం చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున.. టికెట్‌ ధర రూ.2,500 కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు టీటీడీ భక్తులకు వసతి కల్పించడంతో పాటుగా 5 లడ్డూలు కూడా ఇస్తారు. ఇప్పటికే రూ.కోటి విరాళం అందించే భక్తులకు ఇప్పటికే ఉదయాస్తమాన సేవా టికెట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది భక్తులు అంతకంటే తక్కువ ఇస్తారు కాబట్టి.. వారికి కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎస్వీ ఆపన్న హృదయ పథకాన్ని అందబాటులోకి తీసుకొచ్చారు. ఈ వేసవిలో శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్లకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది కాబట్టి.. భక్తులు ఈ ఎస్వీ ఆపన్న హృదయ పథకం కింద విరాళం ఇచ్చి వీటిని పొందొచ్చు. ఈ టికెట్లను ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు.. భక్తులు టికెట్లు నిమిషాల వ్యవధిలో బుక్‌ చేసుకుంటున్నారు. నవజాత శిశువులు, చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఈ నిధుల్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఎస్వీ ప్రాణదానం ట్రస్టు ద్వారా ఒక చిన్నారి గుండె శస్త్ర చికిత్సకు అవసరమయ్యే మందులు, ఆక్సిజనేటర్లు, సర్జరీకి పరికరాలు ఇతర అవసరాల కోసం సుమారు రూ.లక్ష ఖర్చు అవుతోంది. అందుకే ఈ మొత్తాన్ని వ్యక్తులు, సంఘాలు లేదా కార్పొరేట్‌ సంస్థలు విరాళాలు అందించవచ్చని టీటీడీ చెబుతోంది. అంతేకాదు శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలటీ ఆస్పత్రి నిర్వహణ కోసం రూ.కోటి విరాళమిచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సదుపాయాలను అందిస్తోంది.