తెలంగాణ మీ అయ్య జాగీరా.. మేం పోటీ చేస్తాం, తిరుగుతాం.. పవన్ కళ్యాణ్ ఫైర్

Wait 5 sec.

జనసేన పార్టీ తలపెట్టిన సభ రద్దు కావడంతో.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో తాను ఎలా తిరుగుతానో చూస్తామంటూ.. చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నారని.. తెలంగాణ కోసం తాను పోరాటాలు చేసినప్పుడు.. ఈ నాయకులు అంతా ఎక్కడికి పోయారు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను తెలంగాణకు రానివ్వం అంటున్నారని.. ఇదేమైనా మీ అయ్య జాగీరా అంటూ నిలదీశారు. తనను బెదిరించడానికి మీరు ఎవరు అంటూ ప్రశ్నించారు. తనను ఎంత తిట్టినా పట్టించుకోనని.. తనకు తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే బెదిరింపులు ఎక్కువ అని చెప్పారు. భయపడే వాళ్లమే అయితే రాజకీయ పార్టీని పెడతామా అని పేర్కొన్నారు. తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టిందని.. హైదరాబాద్ నడిబొడ్డున పార్టీ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. తెలంగాణకు జనసేన పార్టీ వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణలో లక్ష మంది జనసైనికులు ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణపై తనకు ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు, సంస్కృతికి జనసేన పార్టీ వ్యతిరేకం కాదని తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్.. కానీ విభజించిన తీరుకు మాత్రమే తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. పార్లమెంట్ తలుపులు మూసి విభజించిన తీరు తప్పు అని చెప్పినట్లు తెలిపారు. సామాజిక తెలంగాణ రావాలని చెప్పి మరీ వచ్చానని స్పష్టం చేశారు. తాను తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని అని.. ఓట్లు పడతాయని కాదని.. ఆ రోజుల్లోనే తండాల దాహార్తిని తీర్చామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో తనను తిరగనివ్వం అంటే తెలంగాణలో వారాహి యాత్రకు పర్మిషన్ ఇచ్చారని.. కోదాడ, నల్గొండ ప్రజలు కూడా అండగా నిలిచారని స్పష్టం చేశారు. తెలంగాణ యూత్‌కు మంచి అవకాశాలు రావాలని కోరుకునే వ్యక్తిని తాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని జనసేన నేతలు చాలా సార్లు అడిగారని.. అయితే ఆంధ్రప్రదేశ్‌లోనే అధికారం కోరుకోని వాడిని.. తెలంగాణలో అధికారం ఎందుకు కోరుతానని ప్రశ్నించారు. తనకు అధికారంపై ప్రేమ కాదని.. మార్పుపైనే ప్రేమ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ ప్రజలకు విద్వేషం లేదని.. ఒకవేళ అలా ఉంటే.. తెలంగాణలో ఒక్క ఏపీ వ్యక్తి కూడా ఉండేవారు కాదని తెలిపారు. తెలంగాణ విభజనకు వ్యతిరేకమని వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చెప్పినపుడు ఈ నాయకులు అంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పుడు మాట్లాడకుండా వైఎస్సార్‌కు ఊడిగం చేశారని మండిపడ్డారు. తాను బెదిరింపులకు భయపడేవాడిని కాదని.. తాను ఇప్పటిదాకా ఒక్క తెలంగాణ నేతను కూడా ఒక్క మాట కూడా అనలేదని స్పష్టం చేశారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టంలేదని.. ఎన్నోసార్లు తగ్గి ఉన్నానని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోరుకున్న మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వల్లే సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌‌‍కు వచ్చిందని పేర్కొన్నారు. పాలకులు వేరు.. ప్రజలు వేరని.. పాలకులను తిట్టండని.. కానీ ప్రజలను కాదని తేల్చి చెప్పారు. దేశంలో చాలా ప్రాంతాల్లో తెలుగువారు ఉన్నారని.. అక్కడి నుంచి వారిని పంపిస్తే మన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాను చెరువును ఆక్రమించానని ఆరోపణలు వచ్చాయని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఒకవేళ తాను కబ్జా చేశానని నిరూపణ అయితే.. స్వాధీనం చేసుకోండి అని సీఎం రేవంత్‌ రెడ్డికి చెబుతున్నానని చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని.. తానే తెలంగాణలో తిరుగుతానని.. ఇన్నాళ్లూ భరించామని.. ఇకపై జనసేన పోటీ చేస్తుందని.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ పవన్‌ కళ్యాణ్‌ సవాల్ చేశారు.