తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సభకు అనుమతి లేకపోవడంతో.. తనను విమర్శించిన వారిపై, తన సభను అడ్డుకున్న వారిపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనను తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని, తిరగనివ్వమని మాట్లాడుతున్నారని.. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మిస్టర్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే అని పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. ఈ తెలంగాణ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరు అని.. మీ అయ్య జాగీరు కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. పవన్ కళ్యాణ్ మళ్లీ తన అహంకారాన్ని ఈ మీడియా సమావేశం ద్వారా ప్రదర్శించారని మండిపడ్డారు. తనకు ఆంధ్రప్రదేశ్‌లోనే దిక్కులేదని స్వయంగా పవన్ కళ్యాణ్ అంగీకరించారని గుర్తు చేసిన పొన్నం ప్రభాకర్.. తెలంగాణలో ఏం పని అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పటికీ.. ప్రాంతాలుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలని తాము కోరుకున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభతో తెలంగాణలో పవన్ కళ్యాణ్ పీకేది ఏముందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ లేదా బీజేపీ ఎవరో ఒకరు ఎంగేజ్ చేసుకున్న ఆర్టిస్ట్ అని.. అయితే ఆయనకు సరైన స్క్రిప్ట్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లో ఆర్టిస్ట్‌ను స్క్రీన్ టెస్ట్ చేసినట్లు తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ను బీజేపీ పార్టీ టెస్ట్ చేస్తున్నారనేది వాస్తవం అని తెలిపారు.ఇక తెలంగాణకు పవన్ కళ్యాణ్ రావడానికి, పోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చి చెప్పిన పొన్నం ప్రభాకర్.. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే కావాలని గెలికి మరీ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో సభ నిర్వహిస్తాం అంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రజలకు ఎప్పుడూ తెలంగాణ ప్రజలు స్వాగితిస్తున్నారని గుర్తు చేశారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని తెలిపారు. ఎప్పుడైనా తెలంగాణకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారా.. తెలంగాణ అమరవీరులకు ఏరోజైనా అండగా నిలిచారా అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.