అనంతపురం జిల్లా రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బోగీల మధ్యన ఉండే జాయింట్ కప్లింగ్ ఊడిపోవటంతో రెండు బోగీలు యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి విడిపోయాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ నుంచి బిహార్‌లోని కటిహార్ వెళ్తున్న యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ( 06571 ) మంగళవారం రోజున గుత్తి రైల్వేస్టేషన్‌లో ప్రమాదానికి గురైంది. గుత్తి రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ మీదకు రైలు చేరుకున్న సమయానికి S6, S7 రైలు బోగీల మధ్యన ఉన్న జాయింట్ కప్లింగ్ విడిపోయింది. దీంతో రైలు నుంచి ఎస్6, ఎస్7 బోగీలు విడిపోయాయి. ఈ విషయాన్ని గమనించిన లోకోపైలెట్ వెంటనే అప్రమత్తమయ్యారు. రైలును నిలిపివేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు తేపట్టారు. మరమ్మతు పనుల తర్వాత సుమారు 35 నిమిషాల తర్వాత రైలు తిరిగి బయల్దేరింది. అయితే కప్లింగ్ ఊడిపోయిన ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. సాంకేతిక కారణాలతోనే ఈ ప్రమాదం జరిగిందా.. లేక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ఘటన కారణంగా ప్రయాణం ఆలస్యం కావటంతో రైల్వే ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో మరికొందరు ఊపిరి పీల్చుకున్నారు. యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం ఉదయం ఏడు గంటలకు యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుంది. యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, మార్కాపురం రోడ్, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస రైల్వేస్టేషన్ల మీదుగా ప్రయాణించి గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు బిహార్‌లోని కటియార్ జంక్షన్ చేరుకుంటుంది. ఈ క్రమంలోనే యశ్వంతపూర్ నుంచి వస్తున్న సమయంలో వద్ద మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఎవరికీ ఎలాంటి హానీ కలగకపోవటంతో ఆందరూ ఊపిరి పీల్చుకున్నారు.